కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్‌గా హీరాలాల్‌ సామరియా

కేంద్ర సమాచార కమిషన్‌ ముఖ్య కమిషనర్‌గా 1985 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి హీరాలాల్‌ సామరియా బాధ్యతలు చేపట్టారు.

Published : 07 Nov 2023 05:10 IST

తెలంగాణ క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారికి కీలక పదవి

ఈనాడు, దిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌ ముఖ్య కమిషనర్‌గా 1985 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి హీరాలాల్‌ సామరియా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సమాచార కమిషనర్‌ హోదాలో ఉన్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కూడా పాల్గొన్నారు. సమాచార కమిషన్లలో ఖాళీలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం ఇటీవల సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. సాధ్యమైనంత త్వరగా పోస్టులు భర్తీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నియామకం చేసింది. 1960 సెప్టెంబరు 14న జన్మించిన హీరాలాల్‌ సామరియా స్వస్థలం రాజస్థాన్‌. బీఈ (సివిల్‌) చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తర్వాత తెలంగాణల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్నాళ్లు కేంద్ర క్యాడర్‌లో పనిచేసి పదవీ విరమణ చేశారు. 2020 నవంబరు 7న కేంద్ర సమాచార కమిషనర్‌గా నియమితులై.. ఇప్పుడు పదోన్నతి పొందారు. ఈ బాధ్యతలు చేపడుతున్న తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్‌ గుర్తింపు పొందారు. ఆయన 2025 సెప్టెంబరు 13 వరకూ ఈ పదవిలో ఉంటారు.

ఇద్దరు కేంద్ర సమాచార కమిషనర్ల నియామకం

కేంద్ర సమాచార కమిషనర్లుగా సోమవారం ఇద్దరి నియామకం, బాధ్యతల స్వీకారం వెంటవెంటనే జరిగిపోయాయి. వీరిలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సీఎండీగా పనిచేసిన ఆనంది రామలింగం, హిమాచల్‌ప్రదేశ్‌ అటవీశాఖ హెడ్‌ ఆఫ్‌ ఫోర్స్‌-కం-ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌గా పనిచేసిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి వినోద్‌కుమార్‌ తివారీ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని