లక్షద్వీప్‌లో నిర్లవణీకరణకు సిద్ధం

లక్షద్వీప్‌లో నిర్లవణీకరణ (డీశాలినేషన్‌) ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.

Updated : 09 Jan 2024 04:36 IST

దిల్లీ: లక్షద్వీప్‌లో నిర్లవణీకరణ (డీశాలినేషన్‌) ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘డీశాలినేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలన్న భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు మేము గతేడాది నుంచి లక్షద్వీప్‌లో ఉన్నాం. రేపటి నుంచే పనులు ప్రారంభించబోతున్నాం’ అని పేర్కొంది. లక్షద్వీప్‌లోని బీచ్‌లకు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకుంటూ.. ‘సహజ సిద్ధమైన, నీటి అడుగున ఉండే అందాలను ఇప్పటికీ చూడనివారి కోసం కొన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయి’ అని వివరించింది. ఇజ్రాయెల్‌లో దాదాపు 25శాతం తాగునీరు నిర్లవణీకరణ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రక్రియ అక్కడ విజయవంతం కావడంతో లక్షద్వీప్‌లోనూ ఏర్పాటు చేయాలని భారత్‌ గతంలో ఆహ్వానించింది.

ఏంటీ నిర్లవణీకరణ?

సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి.. వాటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రక్రియే డీశాలినేషన్‌. సాధారణంగా సముద్ర ఉపరితల నీటి కంటే 1,000 నుంచి 2,000 అడుగుల లోతులో ఉన్న నీటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 8 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. ఆ నీటిని సేకరించి ప్రత్యేక పరిస్థితుల్లో గడ్డ కట్టిస్తారు. ఆ తర్వాత మళ్లీ వేడి చేసి.. ఆ నీటి ఆవిరిని గొట్టాల ద్వారా సేకరించి మంచి నీటిగా ఉపయోగిస్తారు. దీనికోసం రివర్స్‌ ఆస్మాసిస్‌ అనే సాంకేతిక విధానాన్ని వినియోగిస్తారు. ఇప్పటికే లక్షద్వీప్‌లో ఆరు ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేసి అందిస్తున్నారు. ఒక ప్లాంటు నుంచి రోజుకు సుమారు లక్ష లీటర్ల నీటిని శుభ్రం చేసే విధంగా వాటిని భారత్‌ రూపొందించింది. తాజాగా ఇజ్రాయెల్‌ తోడైతే మంచి నీటి కొరత తగ్గి పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు