జైపుర్‌లో మెక్రాన్‌, మోదీ రోడ్‌ షో

భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్యనున్న చిరకాల స్నేహ సౌరభాలు మరోసారి వెల్లివిరిశాయి. ఉభయ దేశాల అగ్రనేతల పరస్పర అభివాదాలు, ద్వైపాక్షిక చర్చలకు రాజస్థాన్‌ రాజధాని, చారిత్రక నగరం జైపుర్‌ వేదికగా మారింది.

Published : 26 Jan 2024 04:26 IST

గణతంత్ర దినోత్సవ ముఖ్యఅతిథిగా భారత్‌కు విచ్చేసిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

జైపుర్‌: భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్యనున్న చిరకాల స్నేహ సౌరభాలు మరోసారి వెల్లివిరిశాయి. ఉభయ దేశాల అగ్రనేతల పరస్పర అభివాదాలు, ద్వైపాక్షిక చర్చలకు రాజస్థాన్‌ రాజధాని, చారిత్రక నగరం జైపుర్‌ వేదికగా మారింది. నగర పౌరుల హర్షధ్వానాల మధ్య ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌, భారత ప్రధాని మోదీ రోడ్‌ షో నిర్వహించారు. నేతలిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకొంటూ మసాలా చాయ్‌ను ఆస్వాదించారు. అనంతరం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మెక్రాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ప్రత్యేక విమానంలో గురువారం జైపుర్‌ నగరానికి చేరుకున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌, రాజస్థాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, సీఎం భజన్‌లాల్‌ శర్మ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత మెక్రాన్‌ నగర శివారులోని ఆమెర్‌ కోటను సందర్శించారు. అక్కడ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈలోగా ప్రధాని మోదీ...ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి జైపుర్‌ చేరుకున్నారు. మెక్రాన్‌తో కరచాలనం, ఆత్మీయ ఆలింగనం తర్వాత నేతలిద్దరూ ఓపెన్‌ టాప్‌ వాహనంలో నగరంలోని సుప్రసిద్ధ నక్షత్ర శాల జంతర్‌ మంతర్‌ నుంచి హవా మహల్‌కు చేరుకున్నారు. అక్కడ హస్తకళల దుకాణంలో ప్రధాని మోదీ అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి మెక్రాన్‌కు బహూకరించారు. దుకాణదారునికి రూ.500లను ప్రధాని మోదీ డిజిటల్‌ యూపీఐ ద్వారా చెల్లించారు. ఆ తర్వాత నేతలిద్దరూ సాహూ చాయ్‌వాలా వద్ద మసాలా టీ సేవిస్తూ కబుర్లు చెప్పుకున్నారు. ఇక్కడ కూడా యూపీఐ ద్వారానే మోదీ చెల్లింపులు జరిపారు. అక్కడి నుంచి తమ బయలుదేరి సంగనేరి గేట్ వరకు రోడ్‌ షోలో పాల్గొన్నారు. రాంబాగ్‌ ప్యాలెస్‌లో మెక్రాన్‌ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నేతలిద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని