మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్‌ టచ్‌పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు

నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్‌ టచ్‌’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 08 May 2024 05:52 IST

దిల్లీ: నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్‌ టచ్‌’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్‌లో ఎలా మసులుకోవాలి, మోసపూరిత ప్రవర్తన హెచ్చరిక సంకేతాలను ఎలా గుర్తించాలి, గోప్యత సెట్టింగులు..ఆన్‌లైన్‌లో సరిహద్దులు వంటి వాటి ప్రాముఖ్యతను చిన్నారులకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఎంతో ఉందని సోమవారం కోర్టు అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ మైనర్‌ బాలికను అపహరించి ఆపై లైంగిక దాడిచేసి.. వ్యభిచార కూపంలోకి దింపడానికి యత్నించిన తన కుమారుడికి సాయం చేసిందనే ఆరోపణలతో అరెస్టయిన కమలేశ్‌ దేవి అనే మహిళకు బెయిల్‌ నిరాకరిస్తూ జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న సాంకేతికత వినియోగంలో వాటి దుష్ప్రభావాలపై పిల్లలకు తల్లిదండ్రులు, సంరక్షకులు, విద్యావేత్తలు డిజిటల్‌ అక్షరాస్యతపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ‘వర్చువల్‌ టచ్‌’పై కార్యక్రమాలు, వర్క్‌షాపులు వంటివి నిర్వహించాలంటూ పాఠశాలలు, కళాశాలలు, దిల్లీ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ, దిల్లీ జుడిషియల్‌ అకాడమీలకు సందేశం పంపాల్సిన ఆవశ్యకతను ఈ తీర్పు ద్వారా తెలియజేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు