మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే

ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది.

Published : 08 May 2024 05:54 IST

పతంజలి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రిత్వ శాఖలకు ఆదేశం

దిల్లీ: ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఆ దిశగా మంగళవారం పలు ఆదేశాలిచ్చింది. మోసపూరిత ప్రకటనలకు ఆయా ఉత్పత్తుల ప్రచార తారలుగా ఉండే వ్యక్తులు, తయారీదారులు, ప్రకటన సంస్థలు... సమాన బాధ్యతవహించాల్సి ఉంటుందని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం స్పష్టంచేసింది. ఏదైనా ఒక వాణిజ్య ప్రకటనకు అనుమతి జారీచేయడానికి ముందు...కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ నిబంధనలు-1994కు అనుగుణంగా ఆ ప్రకటన ఉందనే స్వీయ ధ్రువీకరణను ప్రకటనకర్తల నుంచి తీసుకోవాలని తెలిపింది. వీక్షకుల నైతికత, గౌరవం, మతపరమైన భావనలకు భంగం కలిగించని విధంగా, చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రకటనలు ఉండాలని కేబుల్‌ సర్వీస్‌ చట్ట నిబంధనలు చెబుతున్నాయి. ప్రకటన కర్తల స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమాచార, ప్రసార శాఖ నియంత్రణలోని ‘బ్రాడ్‌కాస్ట్‌ సేవా’ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది. ప్రింట్‌ మీడియాలో ప్రచురితమయ్యే ప్రకటనల స్వీయధ్రువీకరణ పత్రాల కోసం నాలుగు వారాల్లోగా పోర్టల్‌ రూపొందించాలని పేర్కొంది. వివిధ ప్రభుత్వ శాఖలు కూడా తమ పరిధిలోకి వచ్చే ఉత్పత్తులపై వినియోగదారుల  ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిని హేతుబద్ధంగా పరిష్కరించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థకు 2018 నుంచి ఆహారోత్పత్తులకు సంబంధించి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న, తీసుకోబోతున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆరోగ్య శాఖకు స్పష్టం చేసింది.

పత్రికా స్వేచ్ఛతో సంబంధం లేదు

ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించుకోవడం కోసం ధనాన్ని వెచ్చించి ఇస్తున్న ప్రకటనలను పత్రికా స్వేచ్ఛతో ముడిపెట్టలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. మోసపూరిత ప్రకటనలను అడ్డుకోవడానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లైసెన్సింగ్‌ అథారిటీలు తీసుకున్న చర్యలేమిటో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలను ఉపసంహరించుకోవడానికి తీసుకున్న చర్యలేమిటని ఆ సంస్థ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం...ఆ సంస్థ ప్రకటనలు ఇప్పటికీ ఇంటర్నెట్‌, వెబ్‌సైట్లు, ఛానళ్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదాపడింది.

ఐఎంఏ అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఆగ్రహం

పతంజలి కేసు విచారణ సందర్భంగా ఇటీవల ధర్మాసనం...కొందరు వైద్యుల అనైతిక చర్యలను ప్రస్తావించింది. ఇతరుల తప్పులను వేలెత్తిచూపుతున్న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) తమ సభ్యుల ప్రవర్తనను సరిచేసుకోవాలని సూచించింది. అదే రోజు ఒక కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు ఆర్‌.వి.అశోకన్‌ మాట్లాడుతూ ధర్మాసనం వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మంగళవారం విచారణ సందర్భంగా పతంజలి తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ గుర్తు చేయగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అశోకన్‌ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదంటూ ఐఎంఏ తరఫు న్యాయవాదికి తమ అసంతృప్తిని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు