RMIT: గాయాలకు స్మార్ట్‌గా ఆట‘కట్టు’

ఒంటిపై ఏర్పడే గాయాలను నయం చేయడానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్‌ కట్టును అభివృద్ధి చేశారు. గాయం సరిగా నయం కాకుంటే.. ఇందులోని సెన్సర్లు రోగిని అప్రమత్తం చేస్తాయి. ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ

Published : 05 Jul 2021 08:02 IST

వాషింగ్టన్‌: ఒంటిపై ఏర్పడే గాయాలను నయం చేయడానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్‌ కట్టును అభివృద్ధి చేశారు. గాయం సరిగా నయం కాకుంటే.. ఇందులోని సెన్సర్లు రోగిని అప్రమత్తం చేస్తాయి. ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. గాయానికి కట్టు కట్టాక.. అది మానుతోందో లేదో తెలుసుకోవాలంటే కట్టు విప్పి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో కట్టు విప్పకుండానే గాయం ఎంత మేర తగ్గిందో తెలుసుకోవడానికి స్మార్ట్‌ కట్టును ఆర్‌ఎంఐటీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇది బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాడటమే కాకుండా ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, గాయం త్వరగా మానిపోయేలా చూస్తుంది. దీన్ని చౌకలో ఉత్పత్తి చేయవచ్చు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌లోని యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ లక్షణాలను సద్వినియోగం చేసుకొని ఈ కట్టును అభివృద్ధి చేశారు. ఆ పదార్థంతో కూడిన ఫ్లోరసెంట్‌ నానో షీట్లను వారు తయారుచేశారు. ఇవి వెంట్రుక కన్నా 10వేల నుంచి లక్ష రెట్లు సన్నగా ఉంటాయి.   వీటిని కట్టులో అమర్చారు. ఆరోగ్యంగా ఉన్న చర్మంలో కొద్దిగా ఆమ్లత్వం, ఇన్‌ఫెక్షన్‌ సోకిన గాయాలు స్వల్పంగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.  గాయానికి కట్టిన కట్టు క్షారత్వానికి లోనైతే అది అతినీలలోహిత కాంతిలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తద్వారా గాయంలో ఇన్‌ఫెక్షన్‌ మొదలైనట్లు నిర్ధారించొచ్చు. ఈ నానోషీట్ల వల్ల మానవ కణాలకు నష్టం కలగదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని