Online Marriage: ఆన్‌లైన్‌ పెళ్లికి అభ్యంతరమేంటి?: కేరళ హైకోర్టు

నేర విచారణలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నమోదయ్యే వాంగ్మూలాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు ఆన్‌లైన్‌ వివాహాలకు అభ్యంతరమేంటని

Updated : 27 Aug 2021 06:57 IST

కోచి: నేర విచారణలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నమోదయ్యే వాంగ్మూలాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు ఆన్‌లైన్‌ వివాహాలకు అభ్యంతరమేంటని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసుకొనే వివాహాలకు ప్రత్యేక వివాహ చట్టం(ఎస్‌ఎంఏ) కింద చట్టబద్ధత కల్పించాలంటూ ఓ పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ పి.బి.సురేశ్‌ కుమార్‌ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ.. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టం స్పందించాలని, లేకపోతే అది సమాజ ఎదుగుదలను అణిచివేస్తుందని గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పెళ్లి చేసుకుందామనుకున్న వారిలో ఒకరు లేదా ఇద్దరు విదేశాలకు వెళ్లిపోవడం, రకరకాల కారణాలతో వారు స్వదేశానికి రాలేకపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయని ఇందుకు సంబంధించిన చాలా కేసులు తమ ముందుకు వస్తున్నాయని జస్టిస్‌ కుమార్‌ తెలిపారు. ‘‘వీడియో కాన్ఫరెన్స్‌ విచారణలో ఓ సాక్షి ప్రమాణాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు, వివాహం చేసుకోదలిచిన పార్టీలకు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి’’ అని అన్నారు. అయితే ఈ ఆన్‌లైన్‌ వివాహాలకు కేరళ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని