Afghanistan: కరెన్సీ విలువ తగ్గి అఫ్ఘాన్‌ అతలాకుతలం

అఫ్గానిస్థాన్‌ కరెన్సీ అఫ్గాన్‌ అఫ్గానీ విలువ నానాటికీ పడిపోతూ ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. అంతర్యుద్ధం, అనావృష్టి, కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు దేశం

Updated : 18 Dec 2021 09:33 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ కరెన్సీ అఫ్గాన్‌ అఫ్గానీ విలువ నానాటికీ పడిపోతూ ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. అంతర్యుద్ధం, అనావృష్టి, కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన స్థితిలో పులిమీద పుట్రలా కరెన్సీ విలువ పతనమవడం పేదరికాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే దేశ జనాభాలో సగంమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆగస్టులో 80 అఫ్గానీలకు ఒక డాలరు వస్తే సోమవారం అది 123 అఫ్గానీలకు చేరింది. గురువారం 100 అఫ్గానీలకు దిగి వచ్చింది. డాలర్ల కొరత వల్ల వస్తు సరఫరా తగ్గిపోయి ధరలు మిన్నంటుతున్నాయి. 3.8 కోట్ల అఫ్గాన్‌ జనాభాలో 2.28 కోట్ల మందికి తీవ్ర ఆహార కొరత ఏర్పడిందనీ, పోషకాహార లోపం పెరిగిపోతోందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యు.ఎన్‌.డి.పి) వెల్లడించింది.

ఆగిన అంతర్జాతీయ సాయం 

తాలిబన్లు పగ్గాలు చేపట్టడానికి ముందే అంతర్యుద్ధం వల్ల అఫ్గాన్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టగానే, వారి పోకడలపై ఆగ్రహించిన అమెరికా, తదితర పాశ్చాత్య దేశాలు తమ బ్యాంకుల్లో ఉన్న వందల కోట్ల డాలర్ల అఫ్గాన్‌ ప్రభుత్వ నిధులను స్తంభింపజేశాయి. 45 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నిలిపేసింది. బియ్యం, గోధుమలు, పప్పులు కొనడానికి కూడా జనం చేతిలో డబ్బు లేదు. ఒకప్పుడు 8 డాలర్లు పలికిన వంట నూనె డబ్బా ధర ఇప్పుడు 18 డాలర్లకు ఎగబాకింది. ఇతర వస్తువుల ధరలూ ఇంతే. కొనుగోళ్లు పడిపోవడంతో దుకాణదారులు అద్దెలు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆదుకోవాలని అఫ్గాన్‌ కేంద్ర బ్యాంకు మాజీ గవర్నర్‌ ఖాన్‌ అఫ్జల్‌ హదావల్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని