
మోదీని కొట్టగలను.. తిట్టగలను
‘మహా’ కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ వ్యాఖ్యలు
భాజపా ఆందోళనతో.. ప్రధాని గురించి మాట్లాడలేదని వివరణ
ముంబయి: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోదీని తిట్టగలను.. ఆయన్ను కొట్టగలను అంటూ పటోల్ వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణులు ఆరోపించాయి. ఇది కాస్త వివాదం కావడంతో తాను మోదీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. స్థానిక గూండాను ప్రస్తావిస్తూ అలా మాట్లాడినట్లు నానా పటోల్ చెప్పుకొచ్చారు. సోమవారం భండారా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పటోల్.. నేను మోదీని ఓడించగలను.. ఆయన్ను తిట్టగలను అంటూ వ్యాఖ్యలు చేశారు. భాజపా కార్యకర్తలు దీనిపై ఆందోళన చేయడంతో పటోల్ మరో విధంగా స్పందించారు. ‘‘నా నియోజకవర్గంలో మోదీ అనే గూండా గురించి ప్రజలు ఫిర్యాదు చేశారు. ఆ గూండా గురించే ఈ వ్యాఖ్యలు చేశాను’ అంటూ పటోల్ స్పష్టంచేశారు. ఇది ప్రధానిని ఉద్దేశించి కాదని తేల్చి చెప్పారు. పటోల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి దిగజారడం విడ్డూరంగా ఉందంటూ సోమవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. పటోల్ శారీరకంగానే ఎదిగారని.. మానసికంగా ఎదగలేదని ఎద్దేవా చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.