Lata Mangeshkar: కిశోర్‌కుమార్‌ నా వెంటపడుతున్నారనుకున్నా..!

ప్రముఖ గాయకుడు కిశోర్‌ కుమార్‌, లతా మంగేష్కర్‌ కలిసి పాడిన ఎన్నో యుగళ గీతాలు యువతను ఉర్రూతలూపాయి. అయితే కిశోర్‌, లతాల మధ్య తొలి పరిచయం జరిగిన తీరు మాత్రం అచ్చం ఓ సినిమా సన్నివేశాన్ని తలపిస్తుంది. కిశోర్‌ గాయకుడు అని తెలియని లత ఆయన తన వెంట పడుతున్నారని పొరపాటుపడ్డారట. ఆ సరదా

Updated : 07 Feb 2022 07:09 IST

నాటి సరదా సంఘటనను గుర్తు చేసుకున్న లతాజీ

ముంబయి: ప్రముఖ గాయకుడు కిశోర్‌ కుమార్‌, లతా మంగేష్కర్‌ కలిసి పాడిన ఎన్నో యుగళ గీతాలు యువతను ఉర్రూతలూపాయి. అయితే కిశోర్‌, లతాల మధ్య తొలి పరిచయం జరిగిన తీరు మాత్రం అచ్చం ఓ సినిమా సన్నివేశాన్ని తలపిస్తుంది. కిశోర్‌ గాయకుడు అని తెలియని లత ఆయన తన వెంట పడుతున్నారని పొరపాటుపడ్డారట. ఆ సరదా సంఘటనను ‘లతా మంగేష్కర్‌: ఇన్‌ హర్‌ ఓన్‌ వాయిస్‌’ పుస్తకంలో ఆమె పంచుకున్నారు. ‘‘నేను ముంబయిలో గ్రాంట్‌ రోడ్డు నుంచి బాంబే టాకీస్‌ స్టూడియో ఉన్న మలద్‌కు లోకల్‌ ట్రైన్లో వెళ్తుండేదాన్ని. ఓరోజు కిశోర్‌దా కూడా రైలెక్కారు. నాకు కాస్త దగ్గర్లో కూర్చున్నారు. అప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదు కాని, బాగా తెలిసిన వ్యక్తిలాగే అనిపించారు. ఆ తర్వాత నేను మలద్‌లో దిగితే ఆయనా దిగారు. అక్కడి నుంచి స్టూడియోకు వెళ్లడానికి టాంగా మాట్లాడుకున్నాను. ఆయనా టాంగాలో నా వెనకే రావడం మొదలుపెట్టారు. ఆయన నా వెంట పడుతున్నారన్న అనుమానం కలిగింది. టాంగా దిగాక నేను స్టూడియో లోపలికి వెళ్తుంటే ఆయనా నన్ను అనుసరించారు. దీంతో నా అనుమానం బలపడింది. అక్కడ ‘జిద్ది’ సినిమాకు పాటను రికార్డు చేయడానికి సిద్ధంగా ఉన్న సంగీత దర్శకుడు ఖేంచంద్‌ ప్రకాశ్‌కు ఈ విషయం చెప్పాను. ‘అంకుల్‌ ఆ కుర్రాడు ఎవరు? నా వెంటే వస్తున్నాడు’ అని ఫిర్యాదు చేశాను. అప్పుడు ఆయన గట్టిగా నవ్వి అసలు విషయం చెప్పారు. ఆయన పేరు కిశోర్‌కుమార్‌ అని, గాయకుడని, ఈ స్టూడియో యజమాని అయిన ప్రముఖ నటుడు అశోక్‌ కుమార్‌కు సోదరుడని చెప్పారు. నాతోపాటు ఆరోజు పాట పాడడానికి వచ్చారని తెలిసింది’’ అని లతాజీ గుర్తుచేసుకున్నారు. వారిద్దరూ కలసి ‘జిద్ది’లో తొలిసారిగా ‘యే కౌన్‌ ఆయా రే..’ అనే గీతాన్ని ఆలపించారు. మరిన్ని హిట్‌ పాటలతో వారి ద్వయానికి మంచి పేరొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని