యూపీ అసెంబ్లీ ఎన్నికల వైచిత్రి..

దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో అత్యధిక, అత్యల్ప మెజారిటీలు సాధించిన అభ్యర్థులు ఇద్దరూ భాజపా అభ్యర్థులే! గాజియాబాద్‌ జిల్లాలోని

Published : 13 Mar 2022 06:32 IST

ఆధిక్యాల్లో అత్యధికం 2,14,835... అత్యల్పం 203

ఆ ఇద్దరూ భాజపా అభ్యర్థులే

ఈనాడు, దిల్లీ: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో అత్యధిక, అత్యల్ప మెజారిటీలు సాధించిన అభ్యర్థులు ఇద్దరూ భాజపా అభ్యర్థులే! గాజియాబాద్‌ జిల్లాలోని షాహిబాబాద్‌ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి సునీల్‌ కుమార్‌ శర్మ సమీప ఎస్పీ అభ్యర్థి ఆమ్రపాల్‌ శర్మపై 2,14,835 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వీరిద్దరి మధ్య ఎన్నికల పోరుకు పదేళ్ల చరిత్ర ఉంది. 2012లో తొలిసారి భాజపా తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సునీల్‌ కుమార్‌ శర్మ ...బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న ఆమ్రపాల్‌ శర్మ చేతిలో 24,348 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2017 ఎన్నికల్లో మళ్లీ భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన సునీల్‌ కుమార్‌... కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమ్రపాల్‌ శర్మపై 1,50,865 ఓట్లతో ఘన విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా ఉన్న ఆమ్రపాల్‌ శర్మకు 1,08,047 ఓట్లు రాగా భాజపా అభ్యర్థి సునీల్‌ కుమార్‌ శర్మకు 3,22,882 ఓట్లు రావడంతో 2,14,835 ఓట్ల ఆధిక్యం లభించింది. తొలిసారి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచి సునీల్‌ కుమార్‌ శర్మను ఓడించిన ఆమ్రపాల్‌ శర్మ, 2017లో కాంగ్రెస్‌, 2022లో ఎస్పీ తరఫున బరిలోకి దిగి సునీల్‌ కుమార్‌ శర్మ చేతిలో చిత్తయ్యారు. కొవిడ్‌ సమయంలో అందించిన సేవలతో సునీల్‌ కుమార్‌ శర్మ ప్రజలకు బాగా దగ్గరయ్యారు.

* బిజ్నోర్‌ జిల్లా పరిధి దామ్‌పూర్‌ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి అశోక్‌ కుమార్‌ రాణా ఎస్పీ అభ్యర్థి నయిమ్‌ ఉల్‌ హసన్‌పై కేవలం 203 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భాజపా అభ్యర్థికి పోస్టల్‌ ఓట్లు కలిసివచ్చాయి. ఈవీఎంల ద్వారా భాజపా అభ్యర్థికి 81,194 ఓట్లు రాగా, ఎస్పీ అభ్యర్థికి 81,310 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్పీ అభ్యర్థికి 116 ఓట్ల ఆధిక్యత లభించింది. అయితే, పోస్టల్‌ ఓట్లలో భాజపా అభ్యర్థికి 597 రాగా ఎస్పీ అభ్యర్థికి 278 మాత్రమే వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ఠాకూర్‌ మూల్‌చంద్‌ చౌహాన్‌కు ఈవీఎంల ద్వారా 38,735 ఓట్లే వచ్చినా పోస్టల్‌ ఓట్లు మాత్రం 258 వచ్చాయి. పోస్టల్‌ ఓట్లలో వచ్చిన చీలిక భాజపా అభ్యర్థి అశోక్‌ కుమార్‌ రాణాకు కలిసొచ్చింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి హుస్సేన్‌ అహ్మద్‌కు కేవలం 790 ఓట్లే వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని