కాలుష్యం కోరలకు 90 లక్షల మంది బలి

కాలుష్యం కోరల్లో చిక్కి భారత్‌లో ఒక ఏడాది (2019)లోనే 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ‘లాన్సెట్‌’ అధ్యయనం వెల్లడించింది. అన్ని రకాల కాలుష్యాల ప్రభావంతో

Published : 19 May 2022 05:27 IST

2019లో భారత్‌లోనే 23.5 లక్షల మరణాలు

‘లాన్సెట్‌’ అధ్యయనం వెల్లడి

ఈనాడు, చెన్నై/దిల్లీ: కాలుష్యం కోరల్లో చిక్కి భారత్‌లో ఒక ఏడాది (2019)లోనే 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ‘లాన్సెట్‌’ అధ్యయనం వెల్లడించింది. అన్ని రకాల కాలుష్యాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మరణాలు సంభవించినట్లు పేర్కొంది. జెనీవాలోని అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ సంస్థకు చెందిన రిచర్డ్‌ ఫుల్లర్‌ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. అధ్యయన బృందంలో చెన్నైకి చెందిన శ్రీరామచంద్ర యూనివర్సిటీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం డైరెక్టర్‌ కె.బాలకృష్ణన్‌ కూడా ఉన్నారు. ఈమేరకు ‘ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ పత్రికలో వివరాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యాంశాలివీ..

ఊపిరి తీస్తోంది..
భారత్‌లో వాయు కాలుష్యం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో 16.7 లక్షల కాలుష్య మరణాలకు ఇదే కారణం. రెండున్నర మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే కాలుష్య రేణువుల వల్ల 9.8 లక్షల మరణాలు సంభవించగా.. ఇళ్లలోని పొగల వల్ల 6.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక వాయు కాలుష్యం గంగా-సింధు మైదాన ప్రాంతంలో నమోదవుతోంది. విద్యుదుత్పాదన, వాహనాలు, పరిశ్రమలు, వ్యవసాయ వ్యర్థాల దహనం, బొగ్గు వాడకం వంటివన్నీ వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇళ్లలో వంటచెరకు, ఇతర బయోమాస్‌ను మండించడం వల్ల కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. భారత్‌లో కాలుష్య నియంత్రణకు వివిధ పథకాలు, సంస్థలు ఉన్నప్పటికీ.. వాటిని సమన్వయం చేస్తూ ముందుకు నడిపే కేంద్రీకృత వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటని ‘లాన్సెట్‌’ అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగానూ వాయు కాలుష్యం 66.70 లక్షల మందిని బలి తీసుకుంది. రెండు దశాబ్దాల్లో కాలుష్య మరణాలు 66% మేర పెరిగాయి.

* 2019లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించిన మరణాల వల్ల 4.6 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది. అది ప్రపంచ జీడీపీలో 6.2 శాతానికి సమానం. భారత్‌లో ఈ ఆర్థిక నష్టం జీడీపీలో 1 శాతానికి సమానం.

* 2019లో సంభవించిన కాలుష్య మరణాల్లో భారత్‌, చైనాలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.

* హృద్రోగ నివారణకు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకుంటేనే సరిపోదు.. కాలుష్యాన్ని కూడా నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగానికి తోడు ఊపిరితిత్తుల క్యాన్సర్‌, మధుమేహం, పక్షవాతం వంటి వ్యాధులకూ కాలుష్యంతో సంబంధం ఉందని అమెరికా ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. కాలుష్యాన్ని నియంత్రిస్తే వాతావరణ మార్పులూ నెమ్మదిస్తాయి. దీంతో ప్రజారోగ్యం మెరుగుపడుతుందని బోస్టన్‌ కళాశాల ఆచార్యుడు ఫిలిప్‌ లాండ్రిగన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని