Published : 21 May 2022 05:23 IST

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు.. యువ న్యాయవాదులకు స్ఫూర్తి ప్రదాత

 ధైర్యంగా, స్వతంత్రంగా కీలక తీర్పులిచ్చారు

సమాజానికి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని ఆచరించారు 

 ఆయన పదవీ విరమణతో మంచి సలహాదారుడిని కోల్పోతున్నా

 వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ వ్యాఖ్యలు

 హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రానికి జస్టిస్‌ నాగేశ్వరరావు నేతృత్వం వహిస్తారని వెల్లడి 

ఈనాడు, దిల్లీ: సమాజానికి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మి, దాన్ని ఆచరించిన గొప్ప వ్యక్తి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కొనియాడారు. ఆర్జన అధికంగా ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి, దేశానికి సేవ చేసేందుకే ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగం అందరికీ సాధ్యం కాదని అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని యువ న్యాయవాదులకు సూచించారు. జస్టిస్‌ నాగేశ్వరరావు వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల ముందు చివరి పనిదినమైన శుక్రవారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. దానికి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జస్టిస్‌ నాగేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. 

 సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా భావోద్వేగపూరిత రోజు. నేను మంచి స్నేహితుడు, సలహాదారుడిని కోల్పోతున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు, నేను.. రెండు నెలల తేడాతో ఒకే ఏడాది గుంటూరులో జన్మించాం. ఆయన ఏసీ కళాశాలలో, నేను నాగార్జున విశ్వవిద్యాలయంలో చదుకున్నాం. చిన్నప్పటినుంచీ జస్టిస్‌ నాగేశ్వరరావు చాలా క్రమశిక్షణతో మెలిగారు. 1982 జులైలో ఆయన న్యాయవాదిగా చేరితే, 1983 జనవరిలో నేను ఆ వృత్తిని ప్రారంభించాను. జస్టిస్‌ నాగేశ్వరరావు గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టి, తర్వాత హైకోర్టుకు మారారు. అక్కడ దిగ్గజ న్యాయవాది వై.సూర్యనారాయణ వద్ద జూనియర్‌గా చేరి తన సామర్థ్యాలను నిరూపించుకున్నారు. తర్వాత సాహసోపేతంగా దిల్లీకి మారారు. గాడ్‌ఫాదర్ల అండ లేకుండా ఇక్కడికొచ్చి ప్రాక్టీస్‌ చేసి విజయవంతమవడం సులభం కాదు. కానీ ఆయన దాన్ని సాధించి చూపారు. కఠోర శ్రమ, దయాగుణం, తెలివితేటలే ఆయన్ను గొప్ప న్యాయవాదిగా తీర్చిదిద్దాయి’’ అని పేర్కొన్నారు. 

స్వతంత్ర న్యాయవాదిగా ఉండటమే ఇష్టం 

 జస్టిస్‌ నాగేశ్వరరావు రెండుసార్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేసి తనదైన ముద్ర వేశారని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గుర్తుచేశారు. ‘‘రెండోసారి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేసినప్పుడు.. ‘ఎందుకు వైదొలిగారు? అందులోనే కొనసాగితే మంచి అవకాశాలు ఉంటాయి కదా?’ అని ఆయన్ను అడిగాను. స్వేచ్ఛాయుత న్యాయవాదిగా తనదైన శైలిలో కేసులను వాదించాలనుకుంటున్నట్లు బదులిచ్చారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ వెళ్తున్నప్పుడు.. ‘కొత్త బాధ్యతలు ఎలా ఉన్నాయి?’ అన్న నా ప్రశ్నకు ‘ఇంకా అలవాటుపడలేదు’ అని జస్టిస్‌ నాగేశ్వరరావు సమాధానమిచ్చారు. ఆయన న్యాయమూర్తిగా ఉండటం కంటే స్వతంత్ర న్యాయవాదిగా ఉండటాన్నే ఇష్టపడ్డారు. అయినా జడ్జి బాధ్యతలను విస్మరించకుండా కష్టపడి పనిచేశారు. ధైర్యంగా, స్వతంత్రంగా తీర్పులిచ్చారు. సుప్రీంకోర్టులోనే కాకుండా దేశంలోని అన్ని ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయవాదిగా వాదనలు వినిపించిన ఘనత ఆయనకుంది’’ అని సీజేఐ పేర్కొన్నారు. 

కీలక తీర్పులిచ్చారు 

 న్యాయ పరిధిని విస్తరించడంలో జస్టిస్‌ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారని సీజేఐ ప్రశంసించారు. ‘‘మద్రాసు బార్‌ అసోసియేషన్‌ కేసు సహా పలు కేసుల్లో జస్టిస్‌ నాగేశ్వరరావు కీలక తీర్పులిచ్చారు. ట్రైబ్యునళ్లు బలహీనపడకుండా చూశారు. ఆర్డినెన్సులను పదేపదే జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కృష్ణకుమార్‌ సింగ్‌ కేసులో తీర్పునిచ్చిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఆయన సభ్యుడు. ఎవరికీ బలవంతంగా టీకా ఇవ్వకూడదని, అలా చేయడం రాజ్యాంగంలోని అధికరణం-21కి విరుద్ధమని జస్టిస్‌ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో భాగంగా అధికరణం-142ను ఉపయోగించి ఆజంఖాన్‌కు వినూత్న పద్ధతిలో బెయిలు మంజూరు చేశారు. దేశంలో క్రిమినల్‌ ట్రయల్స్, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద కేసుల విచారణను వేగవంతం చేయాలని చెప్పి.. అందుకు మార్గదర్శకాలు జారీ చేశారు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గుర్తుచేశారు. 

బార్‌కు మేలిమి రత్నం 

 ‘‘జస్టిస్‌ నాగేశ్వరరావు పదవీ విరమణతో.. గొప్ప విశ్లేషణ శక్తి ఉన్న వ్యక్తిని మనం కోల్పోతున్నాం. ఆయన ఎదుగుదల యువ న్యాయవాదులు, న్యాయమూర్తులకు స్ఫూర్తి. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. ఇకపై దానికి ఆయన నేతృత్వం వహిస్తారు. ఆయన నేతృత్వంలో అది ప్రపంచంలోని గొప్ప కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశిస్తున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు మంచి క్రికెటర్‌ కూడా. 1982లో రంజీ ట్రోఫీ ఆడారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల క్రికెట్‌ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోనే న్యాయమూర్తులు తొలిసారి కప్‌ గెలిచారు. ఆయన నటుడు, బైకర్‌. గోల్ఫ్‌ ఆటగాడు కూడా. కళలను చాలా ఇష్టపడతారు. పదవీ విరమణ తర్వాత వీటన్నింటినీ ఆస్వాదించడానికి ఆయనకు సమయం దొరుకుతుందని భావిస్తున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు ఎంతో సాత్వికుడు. ‘కొందరు న్యాయవాదుల్లా కోర్టులో ఎప్పుడైనా గట్టిగా అరిచారా?’ అని అని రెండు రోజులక్రితం అడిగినప్పుడు.. ‘నేనెప్పుడూ అలా చేయలేదు. అలా అరిచేవారిని చూసి భయపడి పారిపోయేవాడిని’ అని బదులిచ్చారు. జస్టిస్‌ నాగేశ్వరరావు కచ్చితంగా బార్‌కు మేలిమి రత్నంగా, అత్యంత అభిమానపాత్రుడైన సీనియర్‌ న్యాయవాదిగా మిగిలిపోతారు. యువ న్యాయవాదులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. తండ్రి లావు వెంకటేశ్వర్లు అడుగుజాడల్లో ఆయన సొంతూరును దత్తత తీసుకొని దాని అభివృద్ధికి బాటలు వేశారు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశంసించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని