Updated : 21 May 2022 06:15 IST

ఉద్యోగాలిచ్చి భూములు తీసుకున్నారు

 లాలూపై సీబీఐ కొత్త కేసు 

 రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు 

 ఎఫ్‌ఐఆర్‌లో ఆర్జేడీ అధినేత భార్య, కుమార్తెల పేర్లు 

దిల్లీ, పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. 2004-09 మధ్య యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలో గ్రూప్‌-డి ఉద్యోగ నియామకాల్లో ఆయన తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు మోపింది. ఉద్యోగాలిచ్చినందుకుగాను పలువురు అభ్యర్థుల నుంచి మొత్తంగా పట్నాలో లక్ష చదరపు అడుగులకు పైగా భూమిని లాలూ, ఆయన కుటుంబ సభ్యులు ముడుపులుగా స్వీకరించారని పేర్కొంది. ఈ మేరకు సీబీఐలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈ నెల 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా దిల్లీ, పట్నా, గోపాల్‌గంజ్‌ సహా 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వాటిలో లాలూ కుటుంబసభ్యుల నివాసాలూ ఉన్నాయి. 

 తాజా ఎఫ్‌ఐఆర్‌లో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతీ, హేమాయాదవ్‌ల పేర్లు ఉన్నాయి. ముంబయి, జబల్‌పుర్, కోల్‌కతా, హాజీపుర్‌ రైల్వే జోన్లలో ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లనూ అందులో సీబీఐ జోడించింది. రైల్వేలో ‘ఉద్యోగాలిచ్చినందుకు భూముల స్వీకరణ’ కుంభకోణంపై సీబీఐ గత ఏడాది సెప్టెంబరు 23న ప్రాథమిక విచారణ ప్రారంభించింది. దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే రైల్వే అధికారులు కొందరు అభ్యర్థులను గ్రూప్‌-డి స్థాయి పోస్టుల్లో ప్రత్యామ్నాయ వ్యక్తులు (సబ్‌స్టిట్యూట్‌లు)గా నియమించారని.. ఆ తర్వాత వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ కూడా అయ్యాయని సీబీఐ తెలిపింది. ముందుగా నిర్దేశించిన నిబంధనలన్నింటికీ వీరి నియామక ప్రక్రియలో రైల్వే అధికారులు నీళ్లొదిలారని పేర్కొంది. ఆయా అభ్యర్థులకు ఉద్యోగాలు రాగానే.. వారి నుంచి/వారి కుటుంబసభ్యుల నుంచి రబ్రీదేవికి 3 సేల్‌డీడ్ల రూపంలో, మీసా భారతీకి ఒక సేల్‌డీడ్‌తో, హేమాయాదవ్‌కు రెండు గిఫ్ట్‌డీడ్‌ల రూపంలో పట్నాలో భూములు బదిలీ అయ్యాయని వివరించింది. రబ్రీదేవి ప్రధాన వాటాదారుగా ఉన్న ఎ.కె.ఇన్ఫోసిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరిట మరో సేల్‌డీడ్‌ వచ్చిందని వెల్లడించింది. మొత్తంగా పట్నాలో 1.05 లక్షల చదరపు అడుగుల భూమి ఇలా చేతులు మారిందని.. దానికి లాలూ కుటుంబసభ్యులు రూ.13 లక్షల లోపే చెల్లించారని తెలిపింది. కానీ వాటి అసలు విలువ రూ.4.39 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది. 

బిహార్‌ రాజకీయాల్లో కాక 

 దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ కొన్నివారాల కిందటే బెయిలుపై విడుదలయ్యారు. ఇంతలోనే ఆయనపై సీబీఐ మరో కేసు నమోదు చేయడంతో బిహార్‌ రాజకీయాల్లో కాక మరింత పెరిగింది. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పట్నాలో పలుచోట్ల ఆర్జేడీ కార్యకర్తలు అర్ధనగ్న నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కమలదళం చర్యలకు తమ పార్టీగానీ, బిహార్‌ ప్రజలుగానీ భయపడబోరని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. సీబీఐని పంజరంలో చిలకలా ఆయన అభివర్ణించారు. బిహార్‌లో సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ, భాజపా ఉమ్మడిగా అధికారంలో ఉన్నాయి. వాటి మధ్య కొన్నాళ్లుగా విభేదాలు పొడచూపుతున్నాయి! ఈ పరిస్థితుల్లో నీతీశ్, ఆర్జేడీ అగ్ర నేత తేజస్వీ యాదవ్‌ మధ్య ఇటీవల జరిగిన భేటీలు.. జేడీయూ-ఆర్జేడీ మళ్లీ ఏకమవుతాయన్న విశ్లేషణలకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో లాలూపై తాజా కేసు నమోదవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని