టీకా సమధర్మానికి భారతే ఉదాహరణ

కొవిడ్‌ టీకా తయారీ, విశ్వవ్యాప్త పంపిణీ విషయంలో భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నేతలు ప్రశంసలు కురిపించారు. వ్యాక్సిన్‌ సమధర్మానికి, విస్తృత పంపిణీకి భారత్‌ నమూనా అందరికీ ఆదర్శనీయమని

Published : 24 May 2022 05:10 IST

సరైన సమయంలో రూపొందించి,  విదేశాలకూ వాటిని అందిస్తోంది
ప్రపంచ ఆర్థిక వేదిక నేతల ప్రశంస

దావోస్‌: కొవిడ్‌ టీకా తయారీ, విశ్వవ్యాప్త పంపిణీ విషయంలో భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నేతలు ప్రశంసలు కురిపించారు. వ్యాక్సిన్‌ సమధర్మానికి, విస్తృత పంపిణీకి భారత్‌ నమూనా అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సమావేశంలో- కొవిడ్‌ పరీక్షలు, చికిత్సలు, టీకాలు, పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మహమ్మారిని నియంత్రణలోకి తెచ్చేందుకు ఇప్పుడు అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయని; వీటిని సక్రమంగా, న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.

వెల్‌కమ్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ జెరెమీ ఫర్రార్‌ మాట్లాడుతూ- వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్య పెంపు ఘనత భారత్‌కే దక్కుతుందన్నారు. వ్యాక్సిన్ల లభ్యతను పెంచేందుకు పరిశ్రమ తన ప్రయత్నాలను వేగవంతం చేయాల్సి ఉందని, ఈ విషయంలో భారత టీకా తయారీదారులే మంచి ఉదాహరణ అని వ్యాక్సిన్‌ అలయెన్స్‌ ‘గవీ’ సీఈవో సేత్‌ బెర్క్‌లీ చెప్పారు. కొవిడ్‌ టీకాలను అత్యంత వేగంగా అభివృద్ధి చేసినప్పటికీ... పేద దేశాలకూ, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ అవి చేరుకోలేకపోయాయని ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గాబ్రియేలా బుచెర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ సమానత్వం, వాటిని అందరికీ అందజేసే విషయంలో భారత్‌ విధానం అనుసరణీయమని ఉద్ఘాటించారు.

ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించాలన్నదే మా ధ్యేయం: అమితాబ్‌ కాంత్‌

‘‘భారత్‌లో కొవిడ్‌ రెండో ఉద్ధృతి అత్యంత తీవ్రంగా వచ్చింది. బాధితుల సంఖ్య కూడా చాలా ఎక్కువే. ఆ సమయంలో మాకు కేవలం ఇద్దరే ఇద్దరు టీకా తయారీదారులు ఉన్నారు. ఇప్పుడు మా దేశంలో పది మంది వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మరో 14 టీకాల పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయి. కరోనా టీకాల విషయంలో ప్రపంచ రాజధానిగా భారత్‌ ఉండాలని నిర్ణయించాం. మరే దేశంలోనూ ఏ వ్యక్తీ సురక్షితంగా లేనంతవరకూ ఏ భారతీయుడికీ భద్రత లేదని నమ్ముతున్నాం. అందుకే, ప్రతి ఒక్కరికీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యాక్సిన్‌ను అందించాలని నిర్ణయించాం’’ అని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వివరించారు. కొత్త వేరియంట్ల విషయమై ప్రపంచం అప్రమత్తంగా ఉండాలని ఔషధ తయారీ సంస్థ మోడెర్నా సీఈవో స్టీఫెన్‌ బాన్సెల్‌ అన్నారు. డెల్టా మాదిరి ఒమిక్రాన్‌ ప్రమాదకారి కాకపోవడం ఎంతో సాంత్వన కలిగించిందని, మున్ముందు వచ్చే వేరియంట్లు ఆందోళన కలిగించేవి కావచ్చని పేర్కొన్నారు. దీనికి కాంత్‌ బదులిస్తూ- చిన్నారుల అభ్యసన సామర్థ్యాలపైనా, మహిళలపైనా మహమ్మారి ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. సాంకేతిక పరిష్కారాలతో దీన్ని అధిగమించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని