Published : 26 May 2022 06:16 IST

యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు

రూ.10 లక్షల జరిమానా..
ఉగ్రవాదులకు నిధుల కేసులో దిల్లీలోని ఎన్‌ఐఏ కోర్టు తుది తీర్పు

దిల్లీ: కశ్మీరీ వేర్పాటువాదుల్లో కీలక నేత, మూడున్నర దశాబ్దాలకు పైగా క్రియాశీలక పాత్ర వహిస్తున్న యాసిన్‌ మాలిక్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశంపై దాడికి కుట్ర తదితర నేరాల్లో అతనిని దోషిగా తేల్చిన దిల్లీలోని పటియాలా హౌస్‌(ఎన్‌ఐఏ) కోర్టు బుధవారం వివిధ కేసుల్లో విడివిడిగా శిక్షలు ఖరారు చేసింది. అవన్నీ ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌సింగ్‌ ఈ తీర్పును వెలువరించారు. మాలిక్‌కు గరిష్ఠంగా మరణశిక్ష విధించాలని అంతకు ముందు కోర్టుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విజ్ఞప్తి చేసింది. మాలిక్‌ తరఫు న్యాయవాది మాత్రం యావజ్జీవ శిక్షతో సరిపుచ్చాలని కోరారు. వివిధ కేసులకు అనుగుణంగా పలు శిక్షలు, జరిమానాలు మాలిక్‌కు పడ్డాయని న్యాయవాది ఉమేశ్‌ శర్మ తెలిపారు. ఈ శిక్షలపై హైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశాన్ని కోర్టు మాలిక్‌కు ఇచ్చింది.

తుది వాదనల సందర్భంగా.. తాను నేరస్థుడినైతే అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం తనకు పాస్‌పోర్టు మంజూరు చేసి ప్రపంచమంతా ప్రయాణించడానికి ఎందుకు అవకాశమిచ్చిందని మాలిక్‌ ప్రశ్నించాడు. 1994లో తాను ఆయుధాలు విడిచిపెట్టినప్పటి నుంచి మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నట్లు తెలిపాడు. కశ్మీర్‌లో అహింసా రాజకీయాలనే చేసినట్లు వివరించాడు. గత 28 ఏళ్లలో ఉగ్రవాద కార్యకలాపాలు లేదా హింసలో తనకు పాత్ర ఉందని నిఘా వర్గాలు నిరూపిస్తే తాను రాజకీయాలను విడిచిపెడతానని, అలాగే మరణశిక్షకు కూడా సిద్ధమేనని యాసిన్‌ మాలిక్‌ పేర్కొన్నాడు.

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినందుకే..

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద మోపిన అన్ని రకాల అభియోగాల్లోను మాలిక్‌ను ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 19న దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జరిమానా విధించడానికి ఆయన ఆర్థిక స్థితిగతులపై పరిశీలన జరిపి అఫిడవిట్‌ ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థను న్యాయమూర్తి ఆదేశించిన సంగతి విదితమే. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ సహా పలువురు వేర్పాటువాద నేతలపైనా ఎన్‌ఐఏ అభియోగాలు దాఖలు చేసింది.

జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాద కార్యకలాపాల నిర్వహణలో యాసిన్‌ మాలిక్‌ నేతృత్వం వహించిన జేకేఎల్‌ఎఫ్‌ ముందు స్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్‌ల హత్యల్లోనూ ఆ సంస్థ పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. జేకేఎల్‌ఎఫ్‌ దురాగతాలతో కశ్మీర్‌ నుంచి భారీ సంఖ్యలో పండిట్‌లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ ఆ సంస్థకు సంబంధాలు ఉన్నాయి.  

కశ్మీర్‌లో హైఅలర్ట్‌

యాసిన్‌ మాలిక్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో బంద్‌ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మాలిక్‌ను విడుదల చేయించండి: బిలావల్‌

యాసిన్‌ మాలిక్‌పై మోపిన అన్ని అభియోగాలను ఎత్తేసి ఆయన్ను వెంటనే జైలు నుంచి విడుదల చేసేలా భారత్‌ను కోరాలంటూ పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం హైకమిషనర్‌ మిచెలీ బచెలెట్‌కు లేఖ రాశారు.


యాసిన్‌ మాలిక్‌కు శిక్ష విధించడాన్ని జమ్మూకశ్మీర్‌కు చెందిన పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌(పీఏజీడీ) దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించింది. శాంతి ప్రయత్నాలకు విఘాతమని పేర్కొంది. మాలిక్‌కు జైలు శిక్ష విధించడాన్ని హురియత్‌ కాన్ఫరెన్స్‌లోని మితవాద వర్గం, పాకిస్థాన్‌ ప్రభుత్వం వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి.


మాలిక్‌కు వేర్వేరు కేసుల్లో రెండు జీవిత ఖైదులు సహా ఒక్కోటి 10 సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్షలు అయిదింటిని కోర్టు విధించింది. వీటన్నింటినీ ఏకకాలంలో అమలు పరచాలంది. అలాగే రూ.10 లక్షల జరిమానా కూడా చెల్లించాలంది.

- న్యాయవాది ఉమేశ్‌ శర్మ


నేరం..  శిక్ష

1. ఐపీసీ సెక్షన్‌ 120బి(నేరపూరిత కుట్ర): పదేళ్ల జైలు. రూ.10వేల జరిమానా

2. ఐపీసీ సెక్షన్‌ 121(దేశంపై దాడి యత్నం): జీవిత ఖైదు

3. ఐపీసీ సెక్షన్‌ 121ఎ(దేశంపై యుద్ధానికి కుట్ర): పదేళ్ల జైలు. రూ.10వేల జరిమానా

4. యూఏపీఏ సెక్షన్‌ 17(ఉగ్రవాదానికి నిధుల సేకరణ): జీవిత ఖైదు. రూ.10 లక్షల జరిమానా

5. యూఏపీఏ సెక్షన్‌ 18(ఉగ్రదాడికి కుట్ర): పదేళ్ల కారాగారం. రూ.10వేల జరిమానా

6. యూఏపీఏ సెక్షన్‌ 20(ఉగ్రవాదులతో సంబంధాలు): పదేళ్ల జైలు. రూ.10వేల జరిమానా

7. యూఏపీఏ సెక్షన్లు 38, 39(ఉగ్రవాదానికి మద్దతు, సభ్యత్వం): అయిదేళ్ల చొప్పున జైలు, రూ.5వేల జరిమానా


ఉగ్రనిధుల కేసు పూర్వపరాలివీ..

2017: వివిధ వేర్పాటువాద నేతలకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో యాసిన్‌ మాలిక్‌, మరో నలుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆరోపణల నమోదు

2019 ఏప్రిల్‌: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న కేసులో యాసిన్‌ మాలిక్‌ అరెస్టు

2022 మార్చి 20: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

2022 మే 10: యూఏపీఏ కింద నమోదు చేసిన అభియోగాలతో పాటు ఇతర కేసుల్లో నేరాలను అంగీకరించిన మాలిక్‌

2022 మే 19: యాసిన్‌ మాలిక్‌ను దోషిగా నిర్ధరించిన దిల్లీలోని ఎన్‌ఐఏ కోర్టు

2022 మే 25: యావజ్జీవ శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధింపు

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని