జన జయధ్వానాల మధ్య జగన్నాథుడు

ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం వైభవోపేతంగా సాగింది. కరోనా వల్ల గత రెండేళ్లు వేడుకలు ఏకాంతంగా నిర్వహించారు. ఈ సారి భక్తులను అనుమతించడంతో పురుషోత్తముడి

Published : 02 Jul 2022 05:00 IST

పూరీలో నేత్రపర్వంగా పురుషోత్తముడి రథయాత్ర
రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య వేడుక

పూరీ నుంచి న్యూస్‌టుడే బృందం: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం వైభవోపేతంగా సాగింది. కరోనా వల్ల గత రెండేళ్లు వేడుకలు ఏకాంతంగా నిర్వహించారు. ఈ సారి భక్తులను అనుమతించడంతో పురుషోత్తముడి దివ్య ధామం జన సంద్రంగా మారింది. లక్షల మంది భక్తుల హరి బోల్‌ నినాదాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. తెల్లవారుజామున 4 గంటల వరకు పురుషోత్తమ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల సన్నిధిలో మంగళహారతి, మైలం తదితర గోప్య సేవలు పూర్తి చేశారు. 5 గంటల నుంచి చతుర్థామూర్తుల పొహండి (మందిరం నుంచి రథాల వరకు తీసుకొచ్చే ప్రక్రియ) ప్రారంభమైంది. అనంతరం నందిఘోష్‌ (జగన్నాథుని), తాళధ్వజ (బలభద్రుని), దర్పదళన్‌ (సుభద్ర) రథాలపై చతుర్థామూర్తులను కొలువుదీర్చి దైతాపతి సేవాయత్‌లు ప్రత్యేక సేవలు నిర్వహించారు. పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి తమ శిష్యగణంతో పూజలు చేశారు. 11 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌ బంగారు చీపురుతో చెరాపహరా చేసి కస్తూరి కల్లాపి చల్లారు. మధ్యాహ్నం 2 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలు అమర్చారు. అనంతరం వరస క్రమంలో తాళధ్వజ, దర్పదళన్‌, నందిఘోష్‌ రథాలు గుండిచా మందిరం వైపు సాగాయి. హరి బోల్‌, జై జగన్నాథ్‌ అని ప్రార్థనలు చేస్తూ భక్తులు, పోలీసులు, జవాన్లు రథాలు లాగారు. గవర్నరు ఆచార్య గణేశీలాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అశ్వినీ వైష్ణవ్‌ తదితర ప్రముఖులు, ఉన్నతాధికారులు వేడుకలకు హాజరయ్యారు. రథయాత్ర పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా తదితర ప్రముఖులు ప్రజలకు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

గుండిచా మందిరంలో 9 రోజులు

పెంచిన తల్లి (గుండిచా దేవి) మందిరానికి రథయాత్రగా చేరుకున్న చతుర్థామూర్తులు అక్కడ తొమ్మిది రోజులు ఉంటారు. ఆషాఢ శుక్ల దశమి (9వ తేదీన) తిరుగు (బహుడా) యాత్రగా శ్రీక్షేత్రానికి చేరుకుంటారు. 10న హరిశయన ఏకాదశిని పురస్కరించుకుని రథాలపై జగన్నాథ, బలభద్ర, సుభద్రల సున్నాభెషొ (స్వర్ణాభరణ వేడుక) నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని