Radiative Cooler: విద్యుత్తు అవసరం లేని ఏసీ!

వేడి నుంచి ఉపశమనం పొందడానికి నేడు ఏసీలు అనివార్యమయ్యాయి. అయితే వీటి వాడకం వల్ల కరెంటు బిల్లు తడిసిమోపెడవుతోంది. పైగా విద్యుత్తు కోతల సమయంలో ఈ శీతల యంత్రాలు పనిచేయవు. గువాహటిలోని ఐఐటీ

Updated : 05 Jul 2022 09:30 IST

ఐఐటీ గువాహటి పరిశోధకుల ఘనత

ఈనాడు, గువాహటి: వేడి నుంచి ఉపశమనం పొందడానికి నేడు ఏసీలు అనివార్యమయ్యాయి. అయితే వీటి వాడకం వల్ల కరెంటు బిల్లు తడిసిమోపెడవుతోంది. పైగా విద్యుత్తు కోతల సమయంలో ఈ శీతల యంత్రాలు పనిచేయవు. గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపారు. చౌకైన ‘రేడియేటివ్‌ కూలర్‌ పూత’ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఇంటిపైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండానే చల్లదనం అందిస్తుంది.  

ఇలాంటి విధానాలను ‘పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌’గా పేర్కొంటారు. ఇవి సమీప ప్రాంతాల నుంచి వేడిని గ్రహించి, దాన్ని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి  విడుదల చేస్తాయి. ఆ రేడియోధార్మికత.. భూ వాతావరణం గుండా ప్రయాణించి, చల్లగా ఉండే అంతరిక్షంలోకి చేరుతుంది. అయితే పాసివ్‌ రేడియేటివ్‌ కూలర్లు రాత్రివేళ మాత్రమే పనిచేస్తాయి. పగటి సమయంలోనూ ఉపయోగపడాలంటే.. ఈ కూలర్లు సౌర రేడియోధార్మికత మొత్తాన్నీ పరావర్తనం చెందించాలి. అయితే ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన ఇలాంటి శీతల వ్యవస్థలు పగటి సమయంలో సరిపడా చల్లదనం అందించలేకపోతున్నాయని గువాహటి ఐఐటీ పరిశోధకుడు ఆశీష్‌ కుమార్‌ చౌధరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము సిలికాన్‌ డైఆక్సైడ్‌, అల్యుమినియం నైట్రైడ్‌లతో పలుచటి పొరలను అభివృద్ధి చేశామన్నారు. ఇవి సౌర, వాతావరణ రేడియోధార్మికతను 97 శాతం పరావర్తనం చెందించాయని తెలిపారు. దీన్ని పూతగా వాడటం వల్ల ఇంట్లో ఉష్ణోగ్రతలు.. వెలుపలి కన్నా 15 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుతాయని పేర్కొన్నారు.  

‘‘పగటి సమయంలోనూ పనిచేసే పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడం చాలా కష్టం. దీనికి అధిక పరావర్తన సామర్థ్యంతోపాటు ఉద్గారత శక్తి ఎక్కువగా ఉండాలి. మా పరిజ్ఞానంతో ఇది సాధ్యమవుతుంది. భారత్‌ వంటి వేడి దేశాల్లో ఇళ్లు, వాహనాల్లో వాడే సంప్రదాయ శీతల వ్యవస్థకు ఇది ప్రత్యామ్నాయం. సంప్రదాయ శీతల పరిజ్ఞానాలు.. వ్యర్థ వేడిని పరిసరాల్లోకి వెదజల్లుతాయి. రేడియేటివ్‌ కూలింగ్‌.. మిగులు వేడిని అత్యంత చల్లగా ఉండే అంతరిక్షంలోకి నేరుగా పంపడం ద్వారా భూమి మీద ఒక వస్తువును చల్లబరుస్తుంది. పగటి వేళ కూడా ఇది సమర్థంగా పని చేస్తుంది. కంప్యూటర్‌ ఆధారంగా ఈ సాంకేతికతను పరీక్షించాం’’ అని ఐఐటీ గువాహటిలోని ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగ పరిశోధకుడు దేబబ్రత సిక్దర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని