ఖైదీలకు ‘ఆజాదీకా అమృత్‌’ కానుక

జైలులో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్లు పైబడిన మహిళలు, ట్రాన్స్‌ జెండర్‌లకు కేంద్రం శుభవార్త తెలిపింది. ‘‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవం’’లో భాగంగా ఖైదీల సత్ప్రవర్తన ఆధారంగా మూడు విడతల్లో వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. సగం కన్నా ఎక్కువ శిక్షాకాలం పూర్తయిన

Updated : 06 Jul 2022 06:21 IST

 సత్ప్రవర్తన ఆధారంగా జైలు నుంచి విడుదల

కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

దిల్లీ: జైలులో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్లు పైబడిన మహిళలు, ట్రాన్స్‌ జెండర్‌లకు కేంద్రం శుభవార్త తెలిపింది. ‘‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవం’’లో భాగంగా ఖైదీల సత్ప్రవర్తన ఆధారంగా మూడు విడతల్లో వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. సగం కన్నా ఎక్కువ శిక్షాకాలం పూర్తయిన 60 ఏళ్లు పైబడిన పురుషులు, 70శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు కూడా దీన్ని వర్తింపజేయనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. శిక్షాకాలం పూర్తయి జరిమానాలు కట్టలేక ఇంకా జైల్లోనే మగ్గుతున్న నిరుపేదలకూ ఉపశమనం కల్పించింది. వారి జరిమానాలను రద్దు చేయనుంది. చిన్న వయసులో(18-21 ఏళ్లు) నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న వారు.. గతంలో నేర చరిత్ర లేకుంటే, శిక్షా కాలం సగం పూర్తయితే వారినీ విడుదల చేయనున్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను పంపింది. అర్హత కలిగిన ఖైదీలను ఈ ఏడాది ఆగస్టు 15, వచ్చే ఏడాది జనవరి 26, ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఉరిశిక్ష, జీవిత ఖైదు పడిన వారు, అత్యాచారం, ఉగ్రవాదం, వరకట్న వేధింపుల వల్ల మహిళ మృతి, మనీ లాండరింగ్‌ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి ఈ మినహాయింపు వర్తించదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అధికారిక లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా జైళ్లన్నీ నిండిపోయాయి. 4.03 లక్షల మంది ఖైదీలను ఉంచేందుకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 4.78 లక్షల మంది ఉన్నారు. ఇందులో మహిళా ఖైదీలే సుమారు లక్ష వరకు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని