మేం రోడ్డున పడ్డాం.. మీకు మేడలా!: మాజీ మంత్రిపైకి చెప్పు విసిరిన మహిళ

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడిలో రూ.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలతో పట్టుబడి, విచారణ ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్‌ మాజీ మంత్రి, టీఎంసీ బహిష్కృత నేత పార్థా ఛటర్జీపైకి ఓ మహిళ చెప్పు విసిరింది. మంగళవారం ఈడీ

Updated : 03 Aug 2022 08:47 IST

కోల్‌కతా: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడిలో రూ.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలతో పట్టుబడి, విచారణ ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్‌ మాజీ మంత్రి, టీఎంసీ బహిష్కృత నేత పార్థా ఛటర్జీపైకి ఓ మహిళ చెప్పు విసిరింది. మంగళవారం ఈడీ అధికారులు ఆయనను ఆసుపత్రి నుంచి బయటికి తీసుకువచ్చినపుడు ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకొంది. రాష్ట్రంలోని అంతాలా ప్రాంతానికి చెందిన శుబ్రా ఘోరుయ్‌ అనే మధ్య వయస్కురాలైన మహిళ ఈ సాహసానికి ఒడిగట్టింది. ఆ చెప్పు గురి తప్పి ఛటర్జీ పక్కన పడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా పిల్లలు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే.. ఇలాంటి నాయకులు నోట్ల కట్టలు దాచుకునేందుకు మేడలు కడుతున్నారు. అతణ్ని తాడుకు కట్టి లాగాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాగా రాష్ట్రంలో ఆగ్రహంతో ఉన్న లక్షలాది మంది స్పందన ఇదని చెప్పిన ఆమె ఆ చెప్పులు మళ్లీ తాను తీసుకోనని, ఉత్త కాళ్లతోనే ఇంటికి వెళతానని మీడియాకు చెప్పారు. ఈ ఘటన తర్వాత ఈడీ అధికారులు పార్థా ఛటర్జీని ఆసుపత్రి ఆవరణ నుంచి తరలించారు. ‘నేను కుట్రకు బలయ్యా’ అని వ్యాఖ్యానించిన పార్థా ఛటర్జీ టీఎంసీ తన పట్ల తీసుకున్న చర్యలపై విచారం వ్యక్తం చేశారు. కాగా, నగరంలో ఈయనకు చెందిన మరో రెండు ఫ్లాట్లు, ఓ దుకాణంలో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ కేసులో పార్థా ఛటర్జీతోపాటు అరెస్టయిన ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ లావాదేవీలకు సంబంధించిన ఓ జీఎస్టీ నంబరు అసలైనదేనా అనే కోణంలోనూ ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. పన్ను ఎగ్గొట్టేందుకు ఈ నంబరు వాడి ఉంటారని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని