సరిహద్దులపై నిఘాకు అధునాతన డ్రోన్లు

చైనా సరిహద్దులు సహా ఎత్తయిన కొండ ప్రాంతాల్లో నిఘా అవసరాల కోసం అధునాతన డ్రోన్‌ను హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అభివృద్ధి చేస్తోంది. దీర్ఘకాలం పాటు ఇది గగనతలంలోనే ఉండగలదు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో

Published : 08 Aug 2022 05:49 IST

దేశీయంగా అభివృద్ధి చేస్తున్న హెచ్‌ఏఎల్‌

దిల్లీ: చైనా సరిహద్దులు సహా ఎత్తయిన కొండ ప్రాంతాల్లో నిఘా అవసరాల కోసం అధునాతన డ్రోన్‌ను హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అభివృద్ధి చేస్తోంది. దీర్ఘకాలం పాటు ఇది గగనతలంలోనే ఉండగలదు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే ఈ లోహవిహంగం.. బహుళ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ రోటరీ వింగ్‌ డ్రోన్‌.. క్షిపణులు, సెన్సర్లు సహా 40 కిలోల బరువును మోసుకెళ్లగలదు. భారత్‌-చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పర్వత ప్రాంతాల్లో నిఘాను మరింత బలోపేతం చేయడానికి దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది మధ్య నాటికి ఈ డ్రోన్‌ను తొలిసారి గగనవిహారం చేయించాలని హెచ్‌ఏఎల్‌ భావిస్తోంది. మొదటి దశలో 60 డ్రోన్లను ఉత్పత్తి చేయాలనుకుంటోంది. సరకుల రవాణా కోసం కూడా సైనిక దళాలు వీటిని ఉపయోగించుకోవచ్చు. విడిగా ఇజ్రాయెల్‌కు చెందిన హెరాన్‌ టీపీ డ్రోన్లను ఉత్పత్తి చేయడానికి ఉన్న అవకాశాన్నీ హెచ్‌ఏఎల్‌ పరిశీలిస్తోంది. ఇది 35వేల అడుగుల ఎత్తులో 45 గంటల పాటు గగనవిహారం చేయగలదు. హెరాన్‌ టీపీ డ్రోన్లలో ఆటోమేటిక్‌ ట్యాక్సీ టేకాఫ్‌, ల్యాండింగ్‌ సౌకర్యం, ఉపగ్రహ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)తో కలిసి మరో రెండు డ్రోన్‌ ప్రాజెక్టులపై కసరత్తు చేస్తున్నట్లు హెచ్‌ఏఎల్‌ వర్గాలు తెలిపాయి. వచ్చే కొన్నేళ్లలో పెద్ద సంఖ్యలో డ్రోన్లను సమకూర్చుకోవాలని త్రివిధ దళాలు భావిస్తున్నాయి. సాయుధ డ్రోన్లనూ సమకూర్చుకోవాలనుకుంటున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభన, గత ఏడాది జమ్మూలోని వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడి నేపథ్యంలో ఈ అంశంపై సైనిక దళాలు దృష్టిసారించాయి. 300 కోట్ల డాలర్లతో అమెరికా నుంచి 30 ప్రిడేటర్‌ డ్రోన్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. 2020 నవంబరులో భారత నౌకాదళం.. అమెరికా నుంచి లీజు ప్రాతిపదికన రెండు సాయుధ ఎంక్యూ-9బీ సీ గార్డియన్‌ డ్రోన్లను సమకూర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని