CoronaVirus: భారత పర్యాటకులపై నేపాల్‌ నిషేధం

కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులపై నేపాల్‌ నిషేధం విధించింది. ఇలా వచ్చిన నలుగురు భారతీయులకు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో వారిని వెనక్కి పంపిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురూ

Updated : 10 Aug 2022 09:25 IST

 కొవిడ్‌ కేసులు పెరగడంతో నిర్ణయం

కాఠ్‌మాండూ: కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులపై నేపాల్‌ నిషేధం విధించింది. ఇలా వచ్చిన నలుగురు భారతీయులకు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో వారిని వెనక్కి పంపిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురూ ఝులాఘాట్‌ సరిహద్దు ప్రాంతం గుండా నేపాల్‌లోని బైతాడీ జిల్లాలోకి ప్రవేశించారు. వారికి పాజిటివ్‌గా తేలినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. భారతీయులకు కొవిడ్‌ పరీక్షలు కూడా పెంచినట్లు చెప్పారు. భారత్‌ నుంచి తిరిగివచ్చిన నేపాలీలూ పలువురు కొవిడ్‌ బారినపడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు నేపాల్‌లోకి ప్రవేశించకుండా నిలిపివేసినట్లు చెప్పారు. నేపాల్‌లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం 1,090 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 6 నెలల్లో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

పోటలా సౌధం మూసివేత..

బీజింగ్‌: టిబెట్‌లో కొవిడ్‌ కేసులు బయట పడటంతో ప్రఖ్యాత పటోలా సౌధాన్ని చైనా అధికారులు మూసివేశారు. కొత్తగా ఒక్క కేసూ రాకూడదన్న (జీరో-కొవిడ్‌) విధానాన్ని అమలుచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రముఖ టిబెట్‌ బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటలా సౌధాన్ని మంగళవారం నుంచి మూసివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎప్పుడు తెరిచేదీ తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. టిబెట్‌ ఆదాయం ప్రధానంగా పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. ఇందులో పటోలాయే కీలకం. చైనాలో మంగళవారం 828 కొత్త కేసులు బయటపడగా.. వాటిలో 22 టిబెట్‌లో నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.

త్వరలోనే చైనాకు భారతీయ విద్యార్థులు!

చైనాలో చదువుకుంటూ కొవిడ్‌ కారణంగా స్వస్థలాలకే పరిమితమైన వేలాది మంది భారతీయ విద్యార్థులకు డ్రాగన్‌ ఆశావహమైన కబురు చెప్పింది. భారత్‌తో పాటు, వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను తిరిగి రప్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈమేరకు సమీప భవిష్యత్తులోనే తొలి బ్యాచ్‌ భారతీయ విద్యార్థులు చేరుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయమై చర్యలు ముమ్మరం చేసినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకరులకు తెలిపారు. విద్యార్థులను దశలవారీగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చైనాలో చదువుకుంటున్న 23 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు కొవిడ్‌ వీసా నిబంధనల కారణంగా స్వస్థలాల్లో ఉండిపోయారు. వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే. ఈ నేపథ్యంలో చదువుల కోసం తక్షణం తిరిగి రావాలని ఆశిస్తున్న విద్యార్థుల పేర్లను చైనా అడగడంతో.. వందల మందితో జాబితాను భారత్‌ పంపించింది. వీరికి సంబంధించి తిరిగిరప్పించే ప్రక్రియ ఏ దశలో ఉందని విలేకరులు అడగ్గా.. ‘‘ఓపిగ్గా వ్యవహరించండి. దీనిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం’’ అని వెన్‌బిన్‌ తెలిపారు.


కొత్తగా 12,751 మందికి కొవిడ్‌-19
1,31,807కు చేరిన క్రియాశీలక కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా (సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం 8 గంటల వరకు) కొత్తగా 12,751 మందికి వైరస్‌ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 16,167గా నమోదైంది. మరోవైపు, కరోనాతో పోరాడుతూ 42 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 4,41,74,650కి, మొత్తం మరణాల సంఖ్య 5,26,772కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 1,31,807కు దిగివచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివీటీ రేటు 3.50 శాతంగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని