పోక్సో, గృహహింస నిర్దోషులూ పరిహారం కోరితే ఎలా?

చేయని నేరానికి విచారణ ఎదుర్కొన్న బాధితులకు పరిహారమిచ్చేలా, క్రిమినల్‌ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించటానికి సుప్రీంకోర్టు

Published : 19 Aug 2022 04:49 IST

ఇది సంక్లిష్టమైన సమస్య: సుప్రీం కోర్టు

దిల్లీ: చేయని నేరానికి విచారణ ఎదుర్కొన్న బాధితులకు పరిహారమిచ్చేలా, క్రిమినల్‌ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించటానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఇది చట్టరూపకల్పనతో ముడిపడిన అంశమని, చాలా సమస్యలను సృష్టిస్తుందని న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఇందులో న్యాయస్థానాలు చేసేదేమీ లేదు. విషయం కేంద్రం, సంబంధిత సంస్థల దృష్టిలోకి వచ్చింది. చర్యలు తీసుకోవాల్సింది వారే’’ అని తెలుపుతూ పిటిషన్లను కొట్టివేసింది. ‘‘పోక్సో, గృహహింస కేసుల్లో విడుదలైన వారంతా తప్పుడు ప్రాసిక్యూషన్‌కు గురయ్యామని ఆరోపించవచ్చు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందే సంబంధిత సంస్థలే’’ అని ధర్మాసనం తెలిపింది.

అసెస్‌మెంట్‌ అధికారి పరిధిలోని హైకోర్టులోనే అపీళ్లు 

ఆదాయపు పన్ను అపిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ) ఉత్తర్వులను సవాల్‌ చేసే అపీళ్ల విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. మదింపు (అసెస్‌మెంట్‌) అధికారి ఉండే అధికార పరిధిలోని హైకోర్టులోనే అపీళ్లు ఉంటాయని పేర్కొంది. కొన్ని ఐటీఏటీ బెంచ్‌ల పరిధి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది. దీంతో అయోమయం నెలకొంది. దీన్ని దూరం చేస్తూ మదింపు అధికారి పరిధిలోని హైకోర్టుల్లోనే ఐటీఏటీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలయ్యే అపీళ్లు ఉంటాయని న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌, జస్టిస్‌ పి.నరసింహ ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని