ఝార్ఖండ్‌ సీఎంపై అనర్హత వేటు?

ఝార్ఖండ్‌ రాజకీయాలు గురువారం ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గవర్నరుకు సిఫారసు చేసినట్లు ప్రచారం సాగడమే అందుకు కారణం. ఎన్నికల

Published : 26 Aug 2022 05:15 IST

ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని గవర్నరుకు ఈసీ సిఫారసు!
గనుల లీజును కేటాయించుకున్నట్లు అందిన ఫిర్యాదుపై చర్యలు
తనకు సమాచారం లేదన్న సోరెన్‌

రాంచీ: ఝార్ఖండ్‌ రాజకీయాలు గురువారం ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గవర్నరుకు సిఫారసు చేసినట్లు ప్రచారం సాగడమే అందుకు కారణం. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈసీ ప్రతిపాదించినట్లు సమాచారం. గనుల లీజు వ్యవహారంలో సోరెన్‌ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని భాజపా గతంలో చేసిన అభ్యర్థనపై స్పందిస్తూ ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం ఉదయం గవర్నర్‌ రమేశ్‌ బైస్‌కు ఈసీ నుంచి లేఖ అందినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. అయితే అటు రాజ్‌భవన్‌ కానీ, ఇటు గవర్నర్‌ కానీ దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. హేమంత్‌ సోరెన్‌ కూడా ఈ వార్తలను ఖండించారు. రాజ్యాంగ వ్యవస్థలను కొనగలరేమో కానీ, ప్రజల మద్దతును కొనలేరంటూ కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు. సోరెన్‌ పదవికి వచ్చిన ముప్పేమీ లేదని, ఆయన 2024 వరకూ పూర్తికాలం సీఎంగా కొనసాగుతారని జేఎంఎం పేర్కొంది.

ఏంటీ వివాదం?

సీఎం పదవిలో ఉన్న సోరెన్‌.. ఓ మైనింగ్‌ లీజును తన పేరున పొందారంటూ ఇటీవల గవర్నరుకు భాజపా ఫిర్యాదు చేసింది. గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలనూ చూస్తున్న సోరెన్‌ తన కోసం స్వయంగా ఒక లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ ఫిర్యాదు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 9ఏ ప్రకారం.. చట్టసభ్యుడిగా ఉన్నవారు ప్రభుత్వ కాంట్రాక్టులు పొందరాదని, దీన్ని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని.. సోరెన్‌పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై ఈసీ అభిప్రాయాన్ని గవర్నరు కోరారు. ఈసీ తన స్పందన తెలియజేస్తూ సోరెన్‌ను తొలగించాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అది భాజపా నివేదిక: సోరెన్‌

తనపై అనర్హత వేటు వేయాలని గవర్నరుకు ఈసీ నివేదిక పంపినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హేమంత్‌ సోరెన్‌ ఖండించారు. ‘‘ఈ వ్యవహారానికి సంబంధించి ఈసీ నుంచి గానీ, గవర్నరు నుంచి గానీ ఎలాంటి సమాచారం అందలేదు. భాజపా నేతలు కొందరు పాత్రికేయులతో కలసి ఈసీ నివేదికను తయారు చేసినట్లుంది. లేకపోతే సీల్డ్‌ కవరులో వచ్చే నివేదికలోని వివరాలు వారికెలా తెలుస్తాయి?’’ అంటూ ఓ ప్రకటనలో సోరెన్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను భాజపా తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

సుప్రీం కోర్టుకు వెళతాం: జేఎంఎం

ఝార్ఖండ్‌ అసెంబ్లీలో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమికి పూర్తి మెజారిటీ ఉందని, తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని జేఎంఎం పేర్కొంది. ఒకవేళ సోరెన్‌ అనర్హతకు గురైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది. సోరెన్‌ సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే తన భార్య కల్పనకు ఆ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈసీ నిర్ణయం ఏదైనా స్వాగతిస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి భాజపా తొలినుంచి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని