అంతర్జాతీయ నిబంధనలకు భారత్‌ కట్టుబడి ఉంటుంది

అంతర్జాతీయ నిబంధనలకు భారత్‌ ఎప్పడూ కట్టుబడి ఉంటుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటించారు.

Published : 07 Oct 2022 05:17 IST

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటన

ఈనాడు, దిల్లీ: అంతర్జాతీయ నిబంధనలకు భారత్‌ ఎప్పడూ కట్టుబడి ఉంటుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటించారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో గురువారం జి-20 దేశాల పార్లమెంటు స్పీకర్ల సదస్సులో పాల్గొని ‘సమర్థ పార్లమెంటు.. సచేతన ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ‘‘బహుళత్వం, విశ్వశాంతి, సుస్థిరతకు భారత్‌ నిరంతరం మద్దతు పలుకుతూ వస్తోంది. ప్రజాస్వామ్య సంస్థలన్నీ ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకొని ప్రజలకు మరింత చేరువ కావాలి. పార్లమెంటుతో యువత అనుసంధానమై ఉండాలి. దాన్ని సాకారం చేసేందుకు మేం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రస్థానంలో భారత ప్రజాస్వామ్యం మరింత సాధికారికంగా తయారైంది. ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దారులు వేయడానికి పార్లమెంటు నిరంతరం కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, కొవిడ్‌ మహమ్మారి వల్ల ఆహారం, ఇంధన భద్రత సంబంధిత సంక్షోభం తలెత్తింది. అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేసి ప్రపంచ స్థాయి సమస్యలను పరిష్కరించాలి. అందుబాటు ధరల్లో ఆహారం, ఇంధన వనరులు లభ్యమయ్యేలా చూడాలి. ప్రపంచం సమ్మిళితంగా అభివృద్ధి చెందాలంటే యుద్ధాలను దౌత్యమార్గాలు, పరస్పర చర్చల ద్వారా నివారించాలి. ఆహారం, ఇంధనం, పర్యావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధిలాంటి విషయాల్లో ప్రభుత్వాలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పార్లమెంటులదే’’ అని ఆయన పేర్కొన్నారు. సదస్సులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌తోపాటు భారత పార్లమెంటు బృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని