రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో.. కొలీజియం సహా వ్యవస్థలేవీ పరిపూర్ణమైనవి కావు

రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో కొలీజియం సహా వ్యవస్థలేవీ పరిపూర్ణమైనవి కావని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.

Published : 26 Nov 2022 04:05 IST

సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్య

దిల్లీ: రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో కొలీజియం సహా వ్యవస్థలేవీ పరిపూర్ణమైనవి కావని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతమున్న వ్యవస్థ పరిధిలో పనిచేసుకుంటూ వెళ్లడమే ఆ సమస్యకు పరిష్కార మార్గమన్నారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో కొలీజియం సహా వ్యవస్థలేవీ పరిపూర్ణమైనవి కావు. కానీ మనకు అందజేసిన రాజ్యాంగ పరిధిలో మనం పనిచేస్తుంటాం. నాతో సహా జడ్జీలంతా.. రాజ్యాంగాన్ని అమలు చేసే విశ్వాసపాత్రులైన సైనికులే. అపరిపూర్ణతపై నిట్టూర్చకుండా.. ప్రస్తుతమున్న వ్యవస్థ పరిధిలో పనిచేసుకుంటూ వెళ్లడమే మన ముందున్న పరిష్కార మార్గం’’ అని సీజేఐ పేర్కొన్నారు.  విజయవంతమైన ఓ న్యాయవాది ఆర్జనతో పోలిస్తే న్యాయమూర్తి సంపాదన చాలా తక్కువగా ఉంటుందని గుర్తుచేశారు. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సోదర సంబంధాలు ఉండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజూ అభిలషించారు. అవి అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలే తప్ప, తమలో తాము కొట్లాడుకోకూడదని వ్యాఖ్యానించారు. ఎస్‌సీబీఏ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులను కేంద్రం పట్టించుకోకపోవడాన్ని ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

నేడు రాజ్యాంగ దినోత్సవ సంబరాల్లో పాల్గొననున్న ప్రధాని

సుప్రీంకోర్టులో శనివారం జరిగే రాజ్యాంగ దినోత్సవ సంబరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఈ-కోర్టు ప్రాజెక్టులో భాగంగా కొత్త కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని