సంక్షిప్త వార్తలు(5)

దాదాపు రూ.200 కోట్ల ఆర్థిక మోసం వ్యవహారంలో సుకేశ్‌ చంద్రశేఖర్‌, అతడి సన్నిహితులపై నమోదైన నగదు అక్రమ చలామణి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి వాంగ్మూలాన్ని దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం నమోదుచేశారు.

Updated : 03 Dec 2022 06:14 IST

సుకేశ్‌ కేసులో.. నోరా ఫతేహి వాంగ్మూలం నమోదుచేసిన ఈడీ

దిల్లీ: దాదాపు రూ.200 కోట్ల ఆర్థిక మోసం వ్యవహారంలో సుకేశ్‌ చంద్రశేఖర్‌, అతడి సన్నిహితులపై నమోదైన నగదు అక్రమ చలామణి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి వాంగ్మూలాన్ని దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం నమోదుచేశారు. ఈ కేసులో ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు కొత్త విషయాలపై వారు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఆమె వాంగ్మూలం నమోదు ప్రక్రియ ఐదు గంటలకు పైగా సాగింది. సుకేశ్‌ వ్యవహారంలో ఈడీ గతంలో కొన్నిసార్లు నోరాను ప్రశ్నించింది. 2020 డిసెంబరులో చెన్నైలో నిర్వహించిన ఓ ధార్మిక కార్యక్రమానికి సుకేశ్‌ భార్య లీనా తనను ఆహ్వానించినట్లు ఆమె అప్పట్లో అధికారులకు తెలియజేశారు. లీనా ఇచ్చిన ఓ ఖరీదైన బ్యాగు, కొత్త ఐఫోన్‌ను మాత్రమే తాను స్వీకరించినట్లు చెప్పారు.


‘అగస్టా వెస్ట్‌ల్యాండ్‌’ బెయిల్‌ పిటిషన్లపై 6న విచారణ

దిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్య దళారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్‌ మైఖేల్‌ జేమ్స్‌ బెయిలు పిటిషన్లపై ఈ నెల 6వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రెండు వేర్వేరు కేసులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహల ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేస్తూ.. కేసుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున నిందితుడి బెయిల్‌ పిటిషన్లను మంగళవారం విచారిస్తామని పేర్కొంది. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీ నుంచి భారత్‌ కొనుగోలు చేసిన 12 వీవీఐపీ హెలికాప్టర్లకు సంబంధించిన రూ.3,600 కోట్ల వ్యవహారమిది.


జీ-20 అధ్యక్ష బాధ్యతలపై ఇంత ఆర్భాటం ఎందుకు?

జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను సభ్య దేశాలకు రొటేషన్‌ విధానంలో అప్పగించడం ఆనవాయితీ. ఇప్పుడు భారత్‌కు ఆ అవకాశం వచ్చింది. కానీ మోదీ ప్రభుత్వం దీన్ని తమ ఘనతగా చాటుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రచార ఆర్భాటానికి తెరతీసి హైడ్రామా నడుపుతోంది. గతంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దేశాలేవీ ఇలా  వ్యవహరించలేదు.

 జైరాం రమేశ్‌


మస్క్‌ నుంచి నేర్వాల్సిన పాఠాలు

ఎలాన్‌ మస్క్‌ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు: మీ తప్పుల నుంచి నేర్చుకోండి. మీ పనితీరుపై ఇతరుల అభిప్రాయాలను కోరుతూనే ఉండండి. సమస్యలను పరిష్కరించగలిగే ఉద్యోగులను నియమించుకోండి. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మార్చే దిశగా స్పష్టమైన, బలమైన లక్ష్యాన్ని మీ సంస్థకు నిర్దేశించుకోండి. అప్పుడు సిబ్బంది ఉత్తమ పనితీరును ప్రదర్శిస్తారు. ఎల్లప్పుడూ ఎందుకు అన్న ప్రశ్న అడుగుతూ హేతు  బద్ధంగా ఆలోచించండి.

హర్ష్‌ గోయెంకా


బానిసత్వాన్ని రూపుమాపాలి

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది బానిసత్వ ఉచ్చులోకి వెళ్లారు. ఎక్కువగా అట్టడుగు వర్గాల ప్రజలు ఆధునిక బానిసత్వం బారిన పడుతున్నారు. దీన్ని అరికట్టడానికి అన్ని దేశాలూ కఠిన చర్యలు తీసుకోవాలి.

ఆంటోనియో గుటెరస్‌


మానవ విలువలే పునాది కావాలి

మనుషులందరూ స్వభావ సిద్ధంగా కరుణ కలిగినవారే. మానవ విలువలే పునాదిగా మనం కొత్త ప్రపంచాన్ని నిర్మించాలి. అది ఆయుధాల వాడకంపై ఆధారపడకూడదు. మనుషులు ఘర్షణ పడుతూ ప్రాణాలు కోల్పోయినంత కాలం శాంతి దొరకదు. దయాగుణంతోనే మానవాళి భవిష్యత్తు భద్రం.

దలైలామా


దేశమంతా ఏకరూప వైద్యసేవలపై పిటిషన్‌
కేంద్రం, రాష్ట్రాల స్పందన కోరిన సుప్రీంకోర్టు

దిల్లీ: రాజ్యాంగానికి అనుగుణంగా పౌరులు అందరికీ ఏకరూప ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు అమలుచేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషనుపై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రంనాథ్‌ల ధర్మాసనం ఈ మేరకు ప్రభుత్వాలకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. రోగుల హక్కుల కోసం ప్రచార కార్యక్రమం చేపట్టిన ‘జన్‌ స్వాస్థ్య అభియాన్‌’తోపాటు కేఎం గోపకుమార్‌ ఈ పిటిషను దాఖలు చేశారు. ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని అన్ని నిబంధనలు అమలుచేయాలని పిటిషనర్లు కోరారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో రోగుల కోసం ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యం 30 శాతం ప్రజలకే అందుతోందని, మిగతా 70 శాతం ప్రయివేటు సెక్టారు వైపు వెళుతున్నట్లు తెలిపారు. దేశంలో సాధారణ పరిస్థితుల్లోనే కాకుండా కొవిడ్‌-19 వ్యాప్తి వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రజలకు ప్రభుత్వపరంగా గరిష్ఠ వైద్య సదుపాయాలు అందేలా తగినంత బడ్జెట్‌ కేటాయింపులు ఉండాలని కూడా పిటిషనర్లు కోరారు.


రెండు విమానాల అత్యవసరంగా ల్యాండింగ్‌

ముంబయి, కోచి: వేర్వేరు విమానయాన సంస్థలకు చెందిన రెండు విమానాలు అత్యవసరంగా కిందకు దిగిన సంఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. కేరళలోని కన్నౌర్‌ నుంచి దోహా బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని దారిమళ్లించి ముంబయి విమానాశ్రయంలో దించారు. అందులోని ప్రయాణికులకు మరో విమానాన్ని ఏర్పాటు చేసి గమ్యస్థానానికి పంపినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. హైడ్రాలిక్‌ లీక్‌ కారణంగా ఇండిగో విమానాన్ని దారిమళ్లించినట్లు డీజీసీఏ సీనియర్‌ అధికారి తెలిపారు. మరో సంఘటనలో జెడ్డా (సౌదీ అరేబియా) నుంచి కొజికోడ్‌ (కేరళ)కు 197 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరిన స్పైస్‌జెట్‌ విమానం కొచ్చిన్‌ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి 7.19 నిమిషాలకు అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. హైడ్రాలిక్‌ వైఫల్యం కారణంగానే ఆ లోహవిహంగాన్ని దారి మళ్లించి నేలకు దించినట్లు కొచ్చిన్‌ విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు. ప్రయాణికులను దుబాయ్‌ నుంచి వచ్చే మరో విమానంలో కొజికోడ్‌కు పంపుతున్నట్లు స్పైస్‌జెట్‌ అధికారులు తెలిపారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని