సంక్షిప్త వార్తలు(8)

 దేశవ్యాప్తంగా విద్యుత్తు పంపిణీ సంస్థల వాణిజ్య, సరఫరా నష్టాలు 2021 నుంచి 2022 మధ్యకాలంలో 22% నుంచి 17 శాతానికి తగ్గినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ తెలిపింది. దీనివల్ల యూనిట్‌కు 47 పైసల ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది.

Updated : 06 Dec 2022 08:00 IST

డిస్కంలకు తగ్గిన సరఫరా నష్టాలు

ఈనాడు, దిల్లీ:  దేశవ్యాప్తంగా విద్యుత్తు పంపిణీ సంస్థల వాణిజ్య, సరఫరా నష్టాలు 2021 నుంచి 2022 మధ్యకాలంలో 22% నుంచి 17 శాతానికి తగ్గినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ తెలిపింది. దీనివల్ల యూనిట్‌కు 47 పైసల ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 96శాతం విద్యుత్తు సరఫరాచేసే 56 డిస్కంల డేటా ప్రాథమిక విశ్లేషణ ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని తెలిపింది.  వ్యవస్థను మరింత మెరుగ్గా నిర్వహిస్తూ, అవసరాలకు తగ్గట్టు విద్యుత్తు కొనుగోలు చేయడానికి వెసులుబాటు లభిస్తున్నట్లు పేర్కొంది. సరఫరాకయ్యే వాస్తవ వ్యయం, వాస్తవ సగటు ఆదాయం మధ్య తేడా కిలోవాట్‌కు రూ.0.69 నుంచి రూ.0.22కి తగ్గినట్లు తెలిపింది.


ఎఫ్‌సీఆర్‌ఏ నుంచి 117 అంతర్జాతీయ సంస్థలకు మినహాయింపు

దిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)-2010 పరిధిలోకి రాని 117 అంతర్జాతీయ సంస్థల పేర్లతో కేంద్ర హోంశాఖ ఒక జాబితాను విడుదల చేసింది. వీటిలో ఐరాస విభాగాలూ ఉన్నాయి. భారత సంస్థలు ఎలాంటి అవరోధాలు లేకుండా వీటి నుంచి నిధులు అందుకోవచ్చు. విదేశాల నుంచి నిధులు పొందే భారతీయ సంస్థలు తప్పనిసరిగా ఎఫ్‌సీఆర్‌ఏ-2010 కింద నమోదు చేసుకోవాలి. దిల్లీలోని నిర్దేశిత భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ శాఖలో ఖాతాను కలిగి ఉండాలి. ఈ చట్టంలోని ‘విదేశీ మూలం’ నిర్వచనం పరిధిలోకి ఐరాస విభాగాలు, ఇతర అంతర్జాతీయ సంస్థలు రావని హోంశాఖ తాజా పత్రం సూచిస్తోంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎఫ్‌సీఆర్‌ఏకు సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టం చేసింది. వీటిని ఉల్లంఘించిన 2వేల స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్‌ను గత ఐదేళ్లలో రద్దు చేసింది. గత ఏడాది డిసెంబరు చివరి నాటికి దేశంలో 22,762 ఎఫ్‌సీఆర్‌ఏ నమోదిత సంస్థలు ఉన్నాయి.


నేడు అఖిలపక్ష భేటీ
పార్లమెంటు శీతాకాల సమావేశాలపై చర్చ

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఆయా పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలను దీనికి ఆహ్వానించింది. ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. మరోవైపు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. మంగళవారం సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంప్రదాయంగా నిర్వహించే అఖిల పక్ష భేటీకి బదులు ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


దేశంలో 110 యూనికార్న్‌లు

కేంద్ర ప్రభుత్వం అంకుర పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వాటికి సంపూర్ణ సహకారం అందిస్తోంది. దీనివల్ల దేశంలో ఇప్పటివరకూ 110 స్టార్టప్‌లు యూనికార్న్‌ (వంద కోట్ల డాలర్ల విలువ) సంస్థలుగా ఎదిగాయి.

అనురాగ్‌ ఠాకుర్‌


ఉగ్రముఠాల బెదిరింపులపై స్పందన ఏదీ?

కశ్మీరీ పండిట్లను చంపుతామంటూ ఉగ్రవాద ముఠాల నుంచి బహిరంగ బెదిరింపులు వస్తున్నా, దీనిపై ఎవ్వరూ చర్చించడం లేదు. ఎందుకంటే అది ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు అవుతుందన్న భయం. ఓ సినిమాను విమర్శిస్తూ వచ్చిన వ్యాఖ్యలపై చర్చ    జరపడం సులువు. కానీ కశ్మీరీ పండిట్ల  భద్రతకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీయడం కష్టం. 

 ప్రియాంకా చతుర్వేది


ప్రమాదకర స్థాయిలో ఆర్థిక విధ్వంసం

దేశంలో ప్రమాదకర స్థాయిలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. నిరుద్యోగం గత ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగింది. మోదీ ప్రభుత్వం ఈ భయంకరమైన వాస్తవాలను తిరస్కరించడమే కాదు.. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఉద్దేశంతో జీ-20 అధ్యక్ష బాధ్యతలపై అతిగా ప్రచారం చేస్తోంది.

సీతారాం ఏచూరి


ఆరోగ్యకరమైన నేలతోనే సురక్షిత ఆహారం

ఆరోగ్యకరమైన నేలతోనే సురక్షితమైన, పోషకాలతో కూడిన ఆహారం అందుతుంది. అయితే మనం అవలంబించే విధానాల వల్ల మట్టి కలుషితమై పోషక విలువలు తగ్గిపోతున్నాయి. దీని వల్ల మున్ముందు దిగుబడి తగ్గిపోతూ తీవ్ర ఆహార కొరత తలెత్తే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలి.

ఆహార, వ్యవసాయ సంస్థ(ఐరాస అనుబంధం)


ఆర్‌టీఐ పోర్టళ్ల ఏర్పాటుపై మూడువారాల్లోపు స్పందించాలి
హైకోర్టులకు సుప్రీం ఆదేశం

ఈనాడు, దిల్లీ: ఆర్‌టీఐ ఆన్‌లైన్‌ పోర్టళ్ల ప్రారంభంపై హైకోర్టులు తమ స్పందనను మూడు వారాల్లోపు తెలియజేయాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది. అన్నిచోట్లా ఆర్‌టీఐ కోసం ఆన్‌లైన్‌ వ్యవస్థ ఉండేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ ప్రవాసీ లీగల్‌ సెల్‌ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  


ఆ మహిళా సైనికాధికారుల పదోన్నతులపై చర్యలేంటి?
కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: సుప్రీం కోర్టు 2020లో ఇచ్చిన ఆదేశాల మేరకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేసిన తరువాతా తమకు పదోన్నతుల్లో జాప్యం జరుగుతోందంటూ 34 మంది మహిళా సైనికాధికారులు చేసిన ఆరోపణలపై ప్రతిపాదిత చర్యలేమిటో తెలిపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రం, భద్రతా దళాల తరఫు న్యాయవాది ఆర్‌ బాలసుబ్రమణియన్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.


రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించండి
‘దిల్లీ-కేంద్రం’ వివాదంపై సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు

దిల్లీ: దేశరాజధానిలో పరిపాలన సేవలపై ఎవరి నియంత్రణ ఉండాలన్న అంశంపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం మధ్య గత కొన్నాళ్లుగా సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ అంశంలో రాజ్యాంగ సమస్యలు ఉన్నాయని, తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని సోమవారం కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీన్ని దిల్లీ ప్రభుత్వం వ్యతిరేకించింది.ఈ అంశాన్ని మరింత జాప్యం చేసేందుకే.. కేంద్రం ఇలాంటి పన్నాగాలకు పాల్పడుతోందని పేర్కొంది.


లఖింపుర్‌ ఖేరి నిందితుల డిశ్ఛార్జి పిటిషన్‌ కొట్టివేత

లఖింపుర్‌ ఖేరి: లఖింపుర్‌ ఖేరి హింస కేసు నుంచి తమను తప్పించాలంటూ కేంద్ర మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర సహా 13 మంది నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి అప్లికేషన్లను స్థానిక కోర్టు కొట్టివేసింది. మంగళవారం వీరిపై అభియోగాల నమోదు ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది. నిందితులపై ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైంది. గత ఏడాది అక్టోబరు 3న లఖింపుర్‌ ఖేరిలోని టికునియాలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు నిరసనలకు దిగినప్పుడు హింస ప్రజ్వరిల్లిన సంగతి తెలిసిందే. నాడు ఆందోళనకారుల మీద నుంచి వాహనాన్ని నడపడంతో నలుగురు రైతులు చనిపోయారు. ఆ వాహనంలో ఆశిష్‌ మిశ్ర కూడా ఉన్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని