పిల్లల్ని కనడం ‘ఆమె’ ఇష్టం : దిల్లీ హైకోర్టు

గర్భవిచ్ఛిత్తి (అబార్షన్‌) విషయంలో తుది నిర్ణయం తల్లిదేనని దిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. పిల్లల్ని కనాలా.. వద్దా.. పుట్టబోయే బిడ్డకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వగలమా అనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా మాతృమూర్తిదేనని తేల్చి చెప్పింది.

Updated : 07 Dec 2022 05:57 IST

33 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి

దిల్లీ: గర్భవిచ్ఛిత్తి (అబార్షన్‌) విషయంలో తుది నిర్ణయం తల్లిదేనని దిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. పిల్లల్ని కనాలా.. వద్దా.. పుట్టబోయే బిడ్డకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వగలమా అనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా మాతృమూర్తిదేనని తేల్చి చెప్పింది. 26 ఏళ్ల వివాహితకు 33 వారాల గర్భాన్ని విచ్ఛిన్నం చేయించుకునేందుకు కోర్టు అనుమతించింది. అబార్షన్లపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా.. భారతదేశం మాత్రం మహిళల నిర్ణయాన్ని తన చట్టంలో గుర్తించిందని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభా ఎం.సింగ్‌ తెలిపారు. గర్భంలో ఉన్న శిశువుకు మెదడు ఎదుగుదల సమస్యలు ఉన్నట్లు తెలియడంతో గర్భాన్ని తీయించుకోవాలని భావించిన పిటిషనర్‌.. ఆ మేరకు కోర్టును ఆశ్రయించారు. పుట్టబోయే బిడ్డకు వైకల్యస్థాయి, జీవన నాణ్యతపైన మెడికల్‌ బోర్డు దురదృష్టవశాత్తు సరైన నిర్ణయం ప్రకటించలేదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి వల్ల గర్భవిచ్ఛిత్తి విషయంలో మహిళ అభిప్రాయం వైపే మొగ్గాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసికక్షోభ, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకోవాలని.. అన్ని అంశాలనూ చూసిన తర్వాతే గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇస్తున్నామని న్యాయమూర్తి చెప్పారు. బాధితురాలి తరఫున న్యాయవాదులు అన్వేష్‌ మధుకర్‌, ప్రాచీ నిర్వాణ్‌ వాదించారు. తాను గర్భం దాల్చిన తర్వాత 16వ వారం వరకు అల్ట్రాసౌండ్‌ స్కాన్లలోనూ ఎలాంటి ఇబ్బందులు తెలియలేదని, ఇటీవలే ఈ సమస్య గురించి తెలిసిందని పిటిషనరు కోర్టుకు నివేదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని