రిజర్వేషన్లలో మార్పులు చేయం: కేంద్రం

ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటాలో ఎలాంటి మార్పులు చేసే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Published : 08 Dec 2022 05:29 IST

దిల్లీ: ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటాలో ఎలాంటి మార్పులు చేసే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇటీవల  సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని సడలిస్తారా.. ఇతర వెనుకబడిన తరగతులకు 27% మించి కోటా కల్పిస్తారా అని అడిగిన ప్రశ్నకు... అలాంటి ప్రతిపాదనేదీ లేదని బుధవారం లోక్‌సభలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి ప్రతిమా బౌమిక్‌ బదులిచ్చారు.

పార్లమెంటరీ స్థాయీ సంఘాల ఛైర్మన్‌ పదవులను విపక్షాలకిచ్చే సంప్రదాయానికి కేంద్రం తిలోదకాలివ్వడంపై కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని బుధవారం లోక్‌సభలో ఆ పార్టీ నేతలు అధీర్‌ రంజన్‌ చౌధరీ, సుదీప్‌ బందోపాధ్యాయలు లేవనెత్తారు. లోక్‌సభలోని అతి పెద్ద పార్టీల్లో ఒకటైనా.. తమకొక్క చైర్మన్‌ పదవినీ కేటాయించలేదని టీఎంసీ నేత సుదీప్‌ పేర్కొన్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌ పదవుల్లో మార్పులు చేర్పులు చేస్తూ.. అక్టోబరులో లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు ఉత్తర్వులు జారీచేశాయి. ఇందులో కాంగ్రెస్‌, టీఎంసీలు నాలుగు ఛైర్మన్‌ పదవులను కోల్పోయాయి. స్థాయీ సంఘం సమీక్షకు పంపాలంటూ విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బుధవారం బహుళ రాష్ట్ర సహకార సొసైటీల (సవరణ) బిల్లు-2022ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. సహకార సంఘాలు.. రాష్ట్ర జాబితాలోని అంశమని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవడం సరికాదని విమర్శించాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షను కేవలం హిందీలోనే నిర్వహించే ప్రతిపాదనేదీ లేదని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో హిందీ తప్పనిసరి చేస్తామన్న ప్రశ్న కూడా ఉత్పన్నం కాదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్ర.. ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు