Sedition Law: కేంద్రం అభ్యర్థన.. ‘రాజద్రోహ చట్టం’పై విచారణ మరింత ఆలస్యం

రాజద్రోహ చట్టం (Sedition Law) పునఃపరిశీలనపై నిపుణులతో జరుపుతున్న చర్చలు కీలక దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ అంశంపై విచారణ వాయిదా పడింది.

Published : 01 May 2023 16:55 IST

దిల్లీ:  రాజద్రోహ చట్టం (Sedition Law)పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ చట్టం పునఃపరిశీలనపై చర్చలు కీలక దశలో ఉన్నాయని, పూర్తి చేసేందుకు మరింత గడువు ఇవ్వాలని కేంద్రం కోరడంతో సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది.

భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 124ఎ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష ప్రక్రియ ప్రారంభించిందని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం దీని(Sedition Law)పై నిపుణులతో చర్చలు కీలక దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అవి పూర్తయిన తర్వాత నివేదికను పార్లమెంట్‌కు పంపించనున్నట్లు తెలిపారు. అందువల్ల ఈ కేసుపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తర్వాత విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కేంద్ర అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌.. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేశారు. కాగా.. ఈ అంశంపై విచారణకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణ్‌ కోరగా.. కోర్టు అందుకు తిరస్కరించింది. అంతకంటే ముందు దీనిపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

బ్రిటిష్‌ కాలం నాటి ఈ రాజద్రోహ చట్టాన్ని (Sedition Law) నిలిపివేస్తూ గతేడాది మే 11వ తేదీన సుప్రీంకోర్టు చారిత్రక నిర్ణయాన్ని వెలువరించిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు దాని అమలును నిలిపేస్తూ కీలకమైన ఆదేశాలిచ్చింది. అప్పటివరకు సెక్షన్‌ 124ఎ కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లపైనా దర్యాప్తులు, కఠిన చర్యలు తీసుకోవద్దని వెల్లడించింది.

ఇదీ చదవండి: రాజద్రోహ చట్టం అమలు నిలిపివేత

స్వాతంత్ర్యానికి 57 ఏళ్ల పూర్వం 1890లో ఐపీసీలో సెక్షన్‌ 124ఎ పేరుతో ఈ చట్టాన్ని (Sedition Law) తీసుకొచ్చారు. దీని కింద దోషులుగా తేలిన వారికి గరిష్ఠంగా జీవితఖైదు విధించే అవకాశం ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ఈ కేసులు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రాజద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన కొందరు.. ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని