అందరికీ కాదు.. అవసరమైన వారికే ప్రాధాన్యం..

కోరుకున్న వారికి వ్యాక్సిన్‌ అందించడం ముఖ్య విషయం కాదని.. అవసరమైన వారికే టీకా ఇవ్వడం అత్యంత ప్రధానమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Updated : 07 Apr 2021 10:43 IST

దిల్లీ: దేశంలో రెండో దఫా కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. అన్ని వయసుల వారికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించాలనే డిమాండ్‌ ఎక్కువయ్యింది. ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోరుకున్న వారికి వ్యాక్సిన్‌ అందించడం ముఖ్య విషయం కాదని, అవసరమైన వారికే ముందుగా టీకా ఇవ్వడం అత్యంత ప్రధానమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

‘అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌ ఎందుకు అందించకూడదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరణాలను నివారించడం, ఆరోగ్యసంరక్షణ వ్యవస్థలను కాపాడుకోవడమనే రెండు ప్రధాన లక్ష్యాలతోనే ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కోరుకున్న వారికి వ్యాక్సిన్‌ అందించడం ప్రధాన ఉద్దేశం కాదు.. కేవలం అత్యవసరమైన వారికి ఇవ్వడమే ఈ టీకా పంపిణీ ప్రధాన లక్ష్యం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. అందుకే వైరస్‌ ప్రమాదం పొంచివున్న వారికే వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇక దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేయడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను ఎక్కువ మందికి ఇవ్వవచ్చని సూచిస్తూ దిల్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ మధ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలాంటి కీలక సమయంలో విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతికి ప్రాధాన్యం ఇవ్వకుండా.. దేశీయ అవసరాలను గుర్తించాలని పేర్కొన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కూడా వ్యాక్సిన్‌ను 18 ఏళ్ల వయసు పైబడిన వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి మంగళవారం లేఖ రాసింది. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇందుకు మరికొంత సమయం పడుతుందని పరోక్షంగా వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని