PM Modi: ఆ ‘రెడ్‌ డైరీ’ కాంగ్రెస్‌ను ముంచుతుంది..!

1.25 లక్షల ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాల’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేశారు. రాజస్థాన్‌లోని సీకర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Published : 27 Jul 2023 13:41 IST

జైపుర్‌: విత్తనాల నుంచి మార్కెటింగ్‌ వరకు తొమ్మిదేళ్ల పాలనలో రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని సీకర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 1.25 లక్షల ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాల (PM Kisan Samriddhi Kendras)’ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఇటీవల రాజస్థాన్‌లో కలకలం రేపిన ‘రెడ్‌ డైరీ’లోని రహస్యాలు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని నాశనం చేస్తాయన్నారు. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు అందులో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా పేర్కొన్న విషయం తెలిసిందే.

రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం.. అసలు ఏమిటిది?

‘యూరియా ధరల భారం రైతులపై పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. భారత్‌లో యూరియా సంచి ధర 266 రూపాయలు. అదే పాకిస్థాన్‌లో దాదాపు రూ.800గా ఉంది. బంగ్లాదేశ్‌లో రూ.720, చైనాలో రూ.2100లకు దొరుకుతాయి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ వికాసం సాధ్యమని చెప్పారు. నగరాల్లో లభించే ప్రతి సౌకర్యాన్ని పల్లెలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకూ ప్రధాని మోదీ శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేశారు. రాజస్థాన్‌లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రాధాన్యమని, రాబోయే ఎన్నికల్లో భాజపాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

‘గహ్లోత్‌ ప్రసంగం కట్‌’ వివాదంపై మోదీ..

‘వాస్తవానికి ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సింది. కానీ, ఆరోగ్య పరిస్థితుల  కారణంగానే రాలేకపోయారు. ఆయన కాలికి గాయమైంది. సీఎం గహ్లోత్‌ వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ అన్నారు. ప్రధాని కార్యక్రమంలో తన ప్రసంగాన్ని రద్దు చేయడంతో.. ఆయన్ను తాను కేవలం ట్విటర్‌ ద్వారానే ఆహ్వానించగలనని గహ్లోత్‌ అంతకుముందు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటించడం ఆరు నెలల వ్యవధిలో ఇది ఏడోసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని