Rahul Gandhi: జీ20 అతిథుల ముందు.. వాస్తవాలను దాచిపెడుతున్నారు: రాహుల్‌ గాంధీ విమర్శలు

G20 Summit: జీ20 సదస్సు కోసం ప్రపంచ నేతల ముందు కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దిల్లీలో మురికివాడలను షీట్లతో కవర్‌ చేయడంపై ఆయన మాట్లాడారు.

Updated : 09 Sep 2023 16:14 IST

దిల్లీ: భారత్‌ అధ్యక్షతన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) శనివారం ప్రారంభమైంది. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో ప్రపంచ నేతలు సమావేశమయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు కోసం దేశ రాజధానిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సుందరీకరణ పనుల్లో భాగంగా దిల్లీ (Delhi)లోని మురికివాడలను (Slums) కూల్చివేసి, అక్కడి ప్రజలను తరలించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందిస్తూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ నేతల ముందు వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

జీ20 సదస్సు కోసం కొన్ని రోజులుగా దిల్లీలో విస్తృత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కోతులు, ఇతర జంతువులు వేదిక ప్రాంగణం వద్దకు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక, సుందరీకరణ కోసం మురికివాడల్లోని ప్రజలను తొలగించి, అవి కనబడకుండా గ్రీన్‌ షీట్లతో కవర్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కొన్ని దృశ్యాలు కాంగ్రెస్‌ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి కాస్తా వైరల్‌ అయ్యాయి. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. ‘‘మన పేద ప్రజలను, జంతువులను కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోంది. జీ20 సదస్సు కోసం మన దేశానికి విచ్చేసిన అతిథుల నుంచి వాస్తవాలను దాచిపెట్టాల్సిన అవసరం లేదు’’ అని ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చారు.

కూటమిలో.. ‘ఆఫ్రికన్‌ యూనియన్‌’ చేరికతో ప్రయోజనమేంటి..?

మురికివాడలపై మోదీ-బైడెన్‌ చర్చించారా?

ఇదిలా ఉండగా.. జీ20 సదస్సుకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. శుక్రవారం రాత్రి భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో ‘దిల్లీలో మురికివాడల తొలగింపు’ అంశం చర్చకు వచ్చిందా? అని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రతినిధిని ఓ విలేకరి అడిగారు. దీనికి ఆ ప్రతినిధి బదులిస్తూ.. ‘‘అమెరికా, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేయడమే మా ద్వైపాక్షిక సంబంధాల ముఖ్య ఉద్దేశం. దీని గురించే ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని