CAA: అమల్లోకి ‘సీఏఏ’.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Updated : 11 Mar 2024 19:11 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం (Citizenship Amendment Act)-2019  పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ, పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్‌సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయింది. 

దీనిప్రకారం.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. తాజాగా కేంద్రం నిబంధనలు నోటిఫై చేయడంతో అమలులోకి వచ్చినట్లైంది.

దిల్లీలో పలుచోట్ల భద్రత కట్టుదిట్టం

సీఏఏ నిబంధనల్ని కేంద్రం నోటిఫై చేయడంతో దిల్లీలోని పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈశాన్య దిల్లీలోని షాహీన్‌బాగ్‌, జామియా, ఇతర సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను కొన్ని చోట్ల మోహరించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేక ఆందోళనల్లో 2020లో దిల్లీలో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 

దిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో ప్రతి సామాన్యుడి భద్రత తమ బాధ్యత అని డీసీపీ జోయ్‌ టిర్కీ అన్నారు.  సున్నితమైన ప్రాంతాల్లో పౌరుల భద్రత కోసం పోలీసు సిబ్బంది, పారామిలటరీ బలగాల ద్వారా పెట్రోలింగ్‌, చెకింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.  పారామిలటరీ బలగాలతో కలిసి రాత్రిపూట నిఘాను ముమ్మరం చేస్తామన్నారు. శాంతిభద్రతలను ఉల్లంఘించేలా ఎవరీని అనుమతించబోమన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని