Jharkhand : లోదుస్తులు కొనేందుకు దిల్లీ వెళ్లా..! సీఎం సోదరుడి వివాదాస్పద వ్యాఖ్యలు

ఝార్ఖండ్ రాజకీయాల్లో తర్వాత ఏం జరగనుందోనని అంతా ఎదురుచూస్తోన్న తరుణంలో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సోదరుడు బసంత్‌ సోరెన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Updated : 08 Sep 2022 15:20 IST

రాంచీ: ఝార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠగా మారిన తరుణంలో.. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సోదరుడు బసంత్‌ సోరెన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న దుమ్కా నియోజకవర్గం.. ఇటీవల చోటుచేసుకున్న అత్యాచారం, హత్య ఘటనలతో భగ్గుమంటోంది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడిన తీరుతో విపక్షాలకు అస్త్రం దొరికినట్లైంది.

దిల్లీకి వెళ్లివచ్చిన బసంత్‌ సోరెన్‌ మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. దిల్లీ ఎందుకు వెళ్లారంటూ ఈ సమయంలో మీడియా ఆయన్ను ప్రశ్నించింది. దానికి కాస్త ఎబ్బెట్టుగా సమధానం ఇచ్చారు. ‘నా వద్ద లోదుస్తులు అయిపోయాయి. అందుకే వాటిని కొనుగోలు చేసేందుకు దిల్లీ వెళ్లాను’ అని బదులిచ్చారు. అలాగే రాష్ట్రంలో రాజకీయంగా అస్థిరమైన పరిస్థితులున్నాయని అంగీకరించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.

ఆయన మాటలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘జేఎంఎం పార్టీ అధ్యక్షుడు శిబు సోరెన్‌ తనయుడు లోదుస్తుల కొనుగోలు కోసం దిల్లీ వెళ్లారు. అందుకే ఆయన బాధిత కుటుంబాలను కలుసుకోలేకపోయారు’ అంటూ భాజపా నేత నిశికాంత్ దూబే మండిపడ్డారు. 

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసన సభ్యత్వంపై వేటు పడనుందన్న వార్తలతో గత కొద్ది రోజులుగా ఝార్ఖండ్‌ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. తనకు తాను ఓ గని లీజును కేటాయించుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు ఈ పరిస్థితికి దారితీశాయి. ఈ సమయంలో సోరెన్‌ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. తన బలాన్ని నిరూపించుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని