IAS vs IPS: నా పరువు పోయింది.. రూ. కోటి చెల్లించు..!

కర్ణాటక(Karnataka)లో ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారుణుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఇంకా ఆగిపోలేదు. తాజాగా రోహిణి నుంచి రూపకు లీగల్‌ నోటీసులు వెళ్లాయి. 

Updated : 23 Feb 2023 13:32 IST

బెంగళూరు: ఇద్దరు సీనియర్ అధికారిణుల మధ్య వ్యక్తిగత ఫైట్ కర్ణాటక(Karnataka)లో తీవ్ర సంచలనంగా మారింది. రోహిణీ సింధూరి(Rohini Sindhuri) వ్యక్తిగత చిత్రాలను బయటపెడుతూ ఐపీఎస్‌ అధికారిణి రూపా మౌద్గిల్(Roopa Moudgil)చేసిన ఆరోపణలు.. ఎన్నికల ముందు బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai) ప్రభుత్వాన్ని చికాకుపెడుతున్నాయి. ఇక వీరి వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను పోరాడుతున్నట్లు రూప తాజాగా పోస్టు పెట్టగా.. సింధూరినేమో ఆమెకు లీగల్‌ నోటీసులు పంపారు. బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరువుకు భంగం కలిగించినందుకు, ఆరోపణలతో మానసిక వేదన కలిగించినందుకు రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో వెల్లడించారు. ‘ఈ వ్యవహారం తనకు తెలిసిన వారి మధ్య ఒక చర్చనీయాంశంగా మారడంతో రోహిణీ కొద్దిరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు’ అని వాటిల్లో పేర్కొన్నారు. అలాగే సింధూరిని ఉద్దేశించి చేసిన ఫేస్‌బుక్ పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

రూపా మౌద్గిల్‌(Roopa Moudgil)తోపాటు సింధూరి ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి ఆరోపణలను చేసుకోవద్దని, బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితాశర్మ ఇప్పటికే ఆదేశించారు. ఇద్దరినీ బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. అయినా రూపా మళ్లీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం గమనార్హం.  ‘నేను, నా భర్త ఇప్పటికీ కలిసే ఉన్నాం. కుటుంబం విచ్ఛిన్నం కాకుండా పోరాడుతున్నా. పలువురి జీవితాలు నాశనం అయ్యేందుకు కారణమైన మహిళను నిలదీయక తప్పదు’ అంటూ ఆమె పెట్టిన పోస్టు సంచలనం సృష్టిస్తోంది. 

తెరపైకి సామాజిక కార్యకర్త..

ఐఏఎస్‌ అధికారిణి రోహిణీ సింధూరిపై ఫిర్యాదు చేయాలంటూ ఐజీపీ రూపా మౌద్గిల్‌ నాపై ఒత్తిడి తీసుకు వచ్చారని సామాజిక కార్యకర్త గంగరాజు ఆరోపించారు. ఆమె సూచనలను అంగీకరించకపోవడంతో బెదిరించి, దూషించారని ఆయన బుధవారం పేర్కొన్నారు. గంగరాజు- రూప మాట్లాడినట్లు చెబుతున్న 25 నిమిషాల ఆడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. తనను కలుసుకున్న విలేకరులతో గంగరాజు మాట్లాడుతూ.. ‘నా దగ్గర కూడా రూప ఫొటోలు ఉన్నాయి. వాటిని నేను ఎక్కడా విడుదల చేయను. నేను ఆమెలా మహిళ ఫొటోలు విడుదల చేయను. సామాజిక మాధ్యమాలలో మరో అధికారిణి ఫొటోలు పోస్టు చేసి, ఆమె వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు. చూసే దృష్టికోణం సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. మనం వేరే దృష్టితో చూస్తే అవి తప్పుగా కనిపిస్తాయి. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ఉన్న రోహిణీ సింధూరి ఫొటోలలో అసభ్యత ఏముంది?’ అని ప్రశ్నించారు. ‘రోహిణితో వ్యక్తిగత సమస్య ఉంటే.. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం ఏమాత్రం సరికాదు’ అన్నారు. ‘వారిద్దరూ ప్రజలకు సేవకులే. వారిలో ఎవరూ నాకు ఆప్తులు, బంధువులు కాదు. నేను ఎవరి తరఫునా వకల్తా పుచ్చుకోను. అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే, సహ చట్టం ద్వారా తెలుసుకుని, న్యాయపోరాటం చేయడం మాత్రమే తెలుసు’  అని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని