NIRF Rankings: దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా ‘ఐఐటీ మద్రాస్‌’.. వరుసగా అయిదో ఏడాది

భారత్‌లో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ (IIT Madras) వరుసగా అయిదో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు తొలి స్థానం సంపాదించింది.

Updated : 05 Jun 2023 14:02 IST

దిల్లీ: దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ (IIT Madras) వరుసగా అయిదో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు (IISc Bengaluru) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) కింద కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) రూపొందించిన ఈ జాబితా (NIRF Rankings)ను సోమవారం విడుదల చేశారు. విద్యాసంస్థల్లో అందిస్తోన్న విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను కేంద్రం ప్రకటిస్తోంది.

* మొత్తంగా విద్యాసంస్థల జాబితాలో.. ఐఐటీ మద్రాస్ మొదటిస్థానంలో ఉండగా, ఐఐఎస్‌సీ బెంగళూరు రెండు, ఐఐటీ దిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి.

* విశ్వవిద్యాలయాలపరంగా.. ఐఐఎస్‌సీ బెంగళూరు, దిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ పదో స్థానంలో నిలిచింది.

ఇంజినీరింగ్‌ విభాగం: ఐఐటీ మద్రాస్ వరుసగా 8వ ఏడాది తన మొదటి స్థానాన్ని కాపాడుకుంది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది

మేనేజ్‌మెంట్‌: ఐఐఎం అహ్మదాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోళికోడ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఫార్మసీ: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్‌దర్ద్‌, బిట్స్‌ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.

న్యాయవిద్య: బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

* ఉత్తమ పరిశోధన విద్యాసంస్థగా ఐఐఎస్‌సీ బెంగళూరు, ఆవిష్కరణల విభాగంలో ఐఐటీ కాన్పూర్ మొదటి స్థానంలో నిలిచాయి.

* వైద్య విద్య: దిల్లీలోని ఎయిమ్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. చండీగఢ్‌లోని పోస్ట్‌గ్యాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

* ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌: ఐఐటీ రూర్కీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలికట్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

* డెంటల్‌ విభాగం: మొదటి స్థానంలో చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, రెండో స్థానంలో మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మూడో స్థానంలో పుణెలోని డా.డీవై పాటిల్‌ విద్యాపీఠ్‌లు నిలిచాయి.

* కళాశాలల విభాగం: దిల్లీలోని మిరాండా హౌస్‌, హిందూ కాలేజ్‌, చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలు తొలి మూడు స్థానాలు సాధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని