Ambulance: ప్రజల్లో గందరగోళం..! అక్కడి అంబులెన్సులకు కొత్త సైరన్‌

మణిపుర్‌లోని అంబులెన్సులు.. పోలీసులు, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగించని ప్రత్యేకమైన సైరన్‌ శబ్దాలను ఉపయోగించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.

Published : 04 Jan 2024 18:22 IST

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి! ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానికంగా అంబులెన్సు (Ambulances)లు, ఇతర వాహనాలు.. పోలీసులు, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగించని ప్రత్యేకమైన సైరన్‌ను వాడాలని సూచించింది. రాష్ట్రంలోని ప్రస్తుత సున్నిత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించేందుకుగానూ ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

‘‘మణిపుర్‌లో అంబులెన్సులు, పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థల వాహనాలు ఉపయోగించే సైరన్‌ శబ్దం ఒకే విధంగా ఉంది. రాష్ట్రంలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది ప్రజల్లో తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంబులెన్సులు, ఇతర వాహనాల సైరన్‌ శబ్దం.. పోలీసు, దర్యాప్తు ఏజెన్సీల వాహనాల్లో వినియోగించే వాటి విధంగా ఉండకూడదు’’ అని రాష్ట్ర హోంశాఖ పేరిట ప్రకటన వెలువడింది.

‘భద్రతాబలగాలపై దాడిలో.. విదేశీ కిరాయి సైనికుల హస్తం..!’

జాతుల మధ్య ఘర్షణతో అట్టుడికిన మణిపుర్‌లో ఇటీవల మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే. వేర్వేరు ఘటనల్లో పౌరులు, భద్రతాబలగాలపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలతో థౌబాల్‌, ఇంఫాల్‌ తూర్పు, ఇంఫాల్‌ పశ్చిమ, కాక్చింగ్‌, బిష్ణుపుర్‌ జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని