BBC: బీబీసీ కార్యాలయాల్లో సర్వే.. కీలక ఆధారాలు లభ్యమయ్యాయ్‌: సీబీడీటీ

దిల్లీ (Delhi), ముంబయి (Mumbai)బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సర్వేలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది.

Published : 17 Feb 2023 19:33 IST

దిల్లీ: బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌ (BBC) కార్యాలయాల్లో ఐటీ (IT) అధికారులు జరిపిన సర్వేలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వెల్లడించింది. ప్రైసింగ్‌ డాక్యుమెంటేషన్‌ బదిలీకి సంబంధించి వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారని పేర్కొంది. పన్ను చెల్లింపు అంశంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. దిల్లీ (Delhi), ముంబయి (Mumbai) లోని బీబీసీ కార్యాలయాల్లో దాదాపు 10 మందికిపైగా ఐటీ అధికారులు 60 గంటల పాటు సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ సర్వే గురువారం రాత్రి వరకూ కొనసాగింది. ఈ నేపథ్యంలో సీబీడీటీ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

‘కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారతదేశంలోని తమ కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవు’ అంటూ సీబీడీటీ పరోక్షంగా బీబీసీ పేరును ప్రస్తావించింది. ఐటీ అధికారులు తాజాగా చేపట్టిన సర్వేలో ఉద్యోగుల వాంగ్మూలాలు, డిజిటల్‌ డాక్యుమెంట్ల ద్వారా కీలక ఆధారాలు సేకరించినట్లు వెల్లడించింది. అవసరాన్ని బట్టి మరిన్ని వివరాలు సేకరిస్తామని తెలిపింది.

2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. దానిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. అదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది. ఇదో ఒక ప్రచార కార్యక్రమం మాత్రమేనని, వారు ఎంచుకున్న కోణాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే దీనిని రూపొందించారని కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం, పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని