Modi Nepal visit: భారత్‌-నేపాల్‌ స్నేహం మానవాళికి ప్రయోజనకరం: మోదీ

భారత్-నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.......

Published : 16 May 2022 19:50 IST

ఇరు దేశాల మధ్య ఆరు అవగాహన ఒప్పందాలు

కాఠ్‌మాండూ: భారత్-నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. బుద్ధుడి పట్ల ఆరాధన ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తూ ఒకే కుటుంబంగా మారుస్తోందని పేర్కొన్నారు. బుద్ధుడు జన్మించిన నేలపై ఉన్న శక్తి ఉత్తేజకరంగా ఉందన్న మోదీ.. ఇది విభిన్న అనుభూతిని పంచుతోందన్నారు. 2014లో లుంబినిలో నాటేందుకు తాను పంపించిన మహాబోధి మొక్క ఇప్పుడు చెట్టుగా మారిందని పేర్కొన్నారు.

‘బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు. ఆయన అందరివాడు. రాముడికి సైతం నేపాల్​తో బంధం ఉంది. నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు. ఒకే కుటుంబంగా మార్చుతున్నాడు. ఇరుదేశాల సంబంధాలను నేపాల్​లోని ఎత్తయిన పర్వతాల స్థాయికి చేర్చాలి. పండగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు.. ఇలా ఇరుదేశాల మధ్య వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోంది. వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలి’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఒకరోజు పర్యటనలో భాగంగా మోదీ సోమవారం నేపాల్‌కు వెళ్లారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవ్​బా, మోదీ లుంబినిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ మేరకు సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఆరు అవగాహనల ఒప్పందాలు చేసుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, లుంబిని బుద్ధిస్ట్ యూనివర్సిటీ, త్రిభువన్ విశ్వవిద్యాలయాలకు సంబంధించి వివిధ ఒప్పందాలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు