భారత్‌-చైనా: 15గంటలకు పైనే చర్చలు

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించుకునే అంశంపై భారత్‌, చైనా మధ్య దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ చర్చలు జరిగాయి. చైనా భూభాగంలోని మోల్దో సరిహద్దు శిబిరం వేదికగా

Published : 25 Jan 2021 10:26 IST

నేడు రక్షణమంత్రి మీడియా సమావేశం

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించుకునే అంశంపై భారత్‌, చైనా మధ్య దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ చర్చలు జరిగాయి. చైనా భూభాగంలోని మోల్దో సరిహద్దు శిబిరం వేదికగా ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు సాగాయి. 

ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న అనేక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపైనే ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు ప్రధానంగా చర్చించారు. బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన తొలి బాధ్యత చైనాపైనే ఉందని భారత మరోసారి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా చర్చలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 

సరిహద్దుల్లో బలగాలను తగ్గించే తొలి బాధ్యత చైనాదేనని, డ్రాగన్‌ వెనక్కి తగ్గేవరకు.. భారత్‌ బలగాలను తగ్గించబోదని రాజ్‌నాథ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా.. ప్రతిష్టంభన ఏర్పడిన నాటి నుంచి రెండు దేశాల కోర్‌ కమాండర్‌ స్థాయి అధికారులు చర్చలు జరపడం ఇది తొమ్మిదోసారి. భారత బృందానికి ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కోర్‌ (14వ కోర్‌) కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పి.జి.కె.మేనన్‌ నేతృత్వం వహించారు.  

ఇదిలా ఉండగా.. ఓ వైపు సరిహద్దు వివాదంపై రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతుండగానే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి స్వయంగా ప్రతిపాదించిన ఒక సూచనను తానే ఉల్లంఘించింది. ఆ ప్రాంతంలో తన మోహరింపులను పెంచింది. దీంతో భారత్‌ కూడా దీటుగా ప్రతిస్పందిస్తోంది.

ఇదీ చదవండి..

తూర్పు లద్దాఖ్‌లో చైనా వంచన! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని