G20 Summit: ‘ఉక్రెయిన్‌ సంక్షోభం’ ప్రకటనపై ఏకాభిప్రాయం!

జీ20 సదస్సులో ఉక్రెయిన్‌ సంక్షోభం (Ukraine Crisis) ప్రకటనపై సభ్యదేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తాయా? లేదా? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

Published : 09 Sep 2023 16:28 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో జరుగుతోన్న జీ20 సదస్సులో (G20 Summit) కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రకటన (Ukraine Crisis) విషయంలో సభ్యదేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తాయా? లేదా? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం సభ్యదేశాల మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభంపై పొందుపరచాల్సిన ‘పేరా’, వాడిన భాషపై సభ్యదేశాలకు ముసాయిదా ప్రతులు అందించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల జరిగిన పలు అంతర్జాతీయ వేదికలపైనా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సెప్టెంబర్‌ 3-6 తేదీల్లో హరియాణాలో జరిగిన షెర్పాల సమావేశంలోనూ సభ్య దేశాల మధ్య అంగీకారం లభించలేదు. దీంతో జీ20 సదస్సులో సంయుక్త ప్రకటనపై సందిగ్ధత ఏర్పడింది. ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతోన్న రష్యా చర్యను ఖండించాలని పాశ్చాత్య దేశాలు ఒత్తిడి చేస్తుండగా.. చైనా మద్దతుతో రష్యా మాత్రం దాన్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సంయుక్త ప్రకటనలో ఈ అంశం ఉంటుందా? లేదా? దీన్ని భారత్‌ ఏవిధంగా ప్రస్తావిస్తుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్న వేళ దీనిపై సానుకూల వార్తలు వినిపిస్తున్నాయి.

దిల్లీ డిక్లరేషన్‌కు సై.. అంగీకారానికి వచ్చిన సభ్యదేశాలు: మోదీ

గతేడాది బాలిలో (ఇండోనేషియా) జరిగిన సదస్సు ముగింపు ప్రకటనలో ‘రష్యా చర్యను అనేక దేశాలు ఖండించినప్పటికీ.. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి’ అని మాత్రమే పేర్కొన్నారు. అప్పుడు దాన్ని రష్యా, చైనాలు సమ్మతించినప్పటికీ.. భారత్‌లో మాత్రం ససేమిరా అనడంతో ఏకాభిప్రాయం తీసుకురావడం సవాలుగా మారిందని సమాచారం. చివరకు ఈ అంశంపై సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు భారత్‌ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లేనని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సంయుక్త ప్రకటన సదస్సు చివరి రోజు (సెప్టెంబర్‌ 10న) ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని