G20 Summit: దిల్లీ డిక్లరేషన్‌కు సై.. అంగీకారానికి వచ్చిన సభ్యదేశాలు: మోదీ

జీ20 తొలి రోజే అదిరిపోయే ఫలితాలను ఇస్తోంది. ఉదయం ఆఫ్రికా యూనియన్‌కు సభ్యత్వం ఖాయం కాగా.. మధ్యాహ్నం దిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. 

Updated : 09 Sep 2023 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూదిల్లీ భారత్‌ మండపంలోని జరుగుతున్న జీ20 సదస్సు(G20 Summit)లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకొంది. న్యూదిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు మొత్తం ఏకతాటిపైకి వచ్చాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రతిపాదన చేయగా.. సభ్యదేశాల అధినేతలు ఆమోదం తెలిపారు. డిక్లరేషన్‌ కోసం శ్రమించిన మంత్రులు, షెర్పాలు, అధికారులను ప్రధాని అభినందించారు. దీంతో ఇప్పటి వరకు డిక్లరేషన్‌పై ఆదివారం మధ్యాహ్నాం దాకా ఏకాభిప్రాయానికి రావడం కష్టమని.. ఎటువంటి డిక్లరేషన్‌ లేకుండానే సదస్సు ముగిసే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు తేలిపోయాయి. మధ్యాహ్నం సదస్సులో ‘వన్‌ ఫ్యామిలీ’ సమావేశం మొదలైంది.

నేటి ఉదయం వరకు చర్చలు..

శుక్రవారం నుంచి డిక్లరేషన్‌పై జీ20 దేశాల అధికార ప్రతినిధుల (షెర్పాల) సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఇందులో ఉక్రెయిన్‌, వాతావరణ అంశాలపై ఏకాభిప్రాయం మాటెలా ఉన్నా మిగిలిన విషయాల్లో ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత్‌ అధికార ప్రతినిధి అమితాబ్‌ కాంత్‌ ధ్రువీకరించారు. 

బ్రిటన్‌, జపాన్‌ ప్రధానులతో మోదీ ద్వైపాక్షి చర్చలు..!

జీ20 సదస్సు సైడ్‌లైన్స్‌లో భాగంగా ప్రధాని మోదీ అగ్రదేశాధినేతలతో భేటీలు కొనసాగిస్తున్నారు. నేడు తొలి సెషన్‌ వన్‌ఎర్త్‌లో భాగంగా జరిగిన చర్చలు నిర్మాణాత్మంగా జరిగాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విటర్‌లో వెల్లడించారు.  ఇక ఈ సెషన్‌ సైడలైన్స్‌లో భాగంగా ప్రధాని మోదీ, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యాపార బంధం బలోపేతం, భారత్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి అంశాలపై మాట్లాడుకొన్నారు. సుసంపన్న, సుస్థిర ప్రపంచం కోసం కలిసి భవిష్యత్తులో కూడా పనిచేయడం కొనసాగించాలని నిర్ణయించారు. భారత్‌తో కీలకమైన వాణిజ్య ఒప్పందంపై గత కొన్నేళ్లుగా బ్రిటన్‌ చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం విషయంలో వీసాలు, వైన్‌పై పన్ను వంటి కొన్ని అంశాల్లో చిక్కుముడులు పడ్డాయి.

జీ20 విస్తరణ.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు సభ్యత్వం ప్రకటించిన మోదీ

ఇక జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతో కూడా ప్రధాని ద్వేపాక్షిక చర్చలను జరిపారు. ఈ సందర్భంగా వాణిజ్యం ఇతర రంగాల్లో సహకరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీ20 ఇది.. 

న్యూదిల్లీ జీ20 అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని భారత్‌ షెర్పా అమితాబ్‌ కాంత్‌ ఎక్స్ (ట్విటర్‌)లో వెల్లడించారు. ఈ జీ20లో మొత్తం 112 అంశాలపై సభ్యదేశాలు మొత్తం సానుకూలంగా స్పందించాయని పేర్కొన్నారు. 39 అనుబంధ పత్రాలు, 73 అంశాల్లో ఫలితాలను సాధించామని వివరించారు. 2017 నుంచి చూస్తే ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన జీ20 సదస్సు ఇదే అని ఆయన తెలిపారు. గతేడాది బాలిలో జరిగిన సదస్సు కంటే దాదాపు రెట్టింపు అంశాలపై ఏకాభిప్రాయం సాధించినట్లు వెల్లడించారు.

దిల్లీ డిక్లరేషన్‌లో అభివృద్ధి, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులపై సభ్యుల నుంచి 100శాతం ఏకాభిప్రాయం సాధించామని అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. కొత్త జియోపొలిటికల్‌ పేరాలు పుడమి, ప్రజలు, శాంతి, సుసంపన్నత వంటి అంశాలపై శక్తిమంతమైన పిలుపును ఇస్తాయన్నారు. ఇక దిల్లీ డిక్లరేషన్‌లో ముఖ్యంగా బలమైన, సుస్థిర, సమతౌల్య, సమ్మిళత అభివృద్ధి, స్థిరమైన అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి అంశాలపై దృష్టిపెట్టామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని