PM Modi: గత 30 రోజుల్లో.. 85 మంది ప్రపంచ నేతలను కలిశా: మోదీ

భారత దౌత్యం సరికొత్త శిఖరాలను తాకిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్‌’ తుది వేడుకను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

Published : 26 Sep 2023 19:32 IST

దిల్లీ: గత 30 రోజుల్లో భారత దౌత్యం (India Diplomacy) సరికొత్త శిఖరాగ్రాలను అందుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఈ వ్యవధిలో తాను 85 మంది ప్రపంచ నేతలను కలిసినట్లు చెప్పారు. జీ20 సదస్సు (G20 Summit)లో భాగంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. 21వ శతాబ్దపు ప్రపంచ దిశను మార్చే శక్తి కలిగి ఉన్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను, వివిధ వృత్తుల్లోని యువ నిపుణులను అనుసంధానం చేసేందుకు దిల్లీలోని ‘భారత్‌ మండపం’లో ఏర్పాటు చేసిన ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్‌ (G20 University Connect)’ తుది వేడుకను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘అంతర్జాతీయంగా భిన్న పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. ఇన్ని దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం చిన్న విషయం కాదు’ అని ఇటీవలి జీ20 సదస్సును గుర్తుచేస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి ప్రయాణం కొనసాగాలంటే.. స్పష్టమైన, స్థిరమైన పాలన అవసరమని స్పష్టం చేశారు. చంద్రయాన్‌-3 విజయాన్ని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 23 ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా దేశ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. గత 30 రోజుల్లో భారత దౌత్యం కొత్త శిఖరాలకు చేరుకుందని తెలిపారు. జీ20 సదస్సు దిల్లీ కేంద్రీకృత కార్యక్రమమే అయినప్పటికీ.. భారత్‌ దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలిచినట్లు చెప్పారు.

‘మోదీ 51 నిమిషాల ప్రసంగంలో.. 44 సార్లు కాంగ్రెస్‌ పేరు’

భారత్ చొరవతో బ్రిక్స్‌ కూటమిలో కొత్తగా ఆరు దేశాలు చేరినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘దిల్లీ డిక్లరేషన్‌’పై ఏకాభిప్రాయం ప్రపంచ హెడ్‌లైన్‌లలో నిలిచిందన్నారు. గత నెల రోజుల్లో పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మధ్యతరగతి వర్గాల సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పీఎం విశ్వకర్మ యోజన, రోజ్‌గార్ మేళా, కొత్త పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం వంటివి ప్రస్తావించారు. ‘‘ఆశావాదం, అవకాశాలు, స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరచగలిగే చోటే యువత రాణిస్తుంది. ‘గొప్పగా ఆలోచించండి..’ ఇదే యువతకు నా సందేశం’’ అని ప్రధాని మోదీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని