Bharat Gaurav: యోగా సాధనకు ‘భారత్‌ గౌరవ్‌’ రైలులో ప్రత్యేక కోచ్‌లు!

భారత్‌ గౌరవ్‌ రైలులోని రెండు కోచ్‌లను యోగా ప్రాక్టీస్‌ కోసమే కేటాయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి........

Published : 11 Jun 2022 00:14 IST

దిల్లీ: దేశంలోని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు, భారతీయ సంస్కృతిని తెలియజేసేలా రైల్వేశాఖ ‘భారత్‌ గౌరవ్‌’ రైళ్లను నడుపనున్న విషయం తెలిసిందే. భారతదేశ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రాక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల విశేషాలను దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలియచేయాలనే లక్ష్యంతో ఈ రైళ్లను నడుపనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రాజెక్టులోని మొట్టమొదటి రైలు జూన్‌ 21న ప్రారంభం కానుంది. రాముని చరిత్ర తెలియజేసేలా.. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి పలు ప్రదేశాలను చుట్టుముట్టి నేపాల్‌కు చేరుకోనుంది. ఈ రైలు కోచ్‌లను ఈనెల 17న అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

అయితే, ఈ రైలులో యోగా సాధన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైలులోని రెండు కోచ్‌లను యోగా ప్రాక్టీస్‌ కోసమే కేటాయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ రెండు బోగీల్లో యోగా సాధన కోసం సరైన వెసులుబాట్లు, మ్యాట్లు, పలు పోస్టర్లును అంటించినట్లు తెలుస్తోంది. ఆసనాలు వేయించేందుకు ఓ బోధకుడు కూడా ఉండనున్నారు. యోగాపై ఆసక్తిగలవారు, రోజూ చేసేవారు రైలులోనే చేసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ సరిహద్దులను దాటి వేరే దేశానికి ప్రయాణించే మొదటి పర్యాటక రైలుగా భారత్ గౌరవ్ నిలువనుంది. థర్డ్ ఏసీ క్లాస్ కోచ్‌లతో రూపొందించిన మొదటి పర్యాటక రైలు కానుంది.

జూన్‌ 21 ప్రారంభం కానున్న ఈ రైలు మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, 12 పట్టణాల గుండా ప్రయాణించనుంది. మొత్తం 18 రోజులపాటు ఈ జర్నీ సాగనుంది. 600 సీటింగ్‌ కెపాసిటీతో నడిచే ఈ రైలులో ఇప్పటికే 450 సీట్లు ఇప్పటికే బుక్‌ అయ్యాయి. ఒక్కో టికెట్‌ ధర రూ.65వేలుగా నిర్ణయించారు. ఆన్‌బోర్డ్‌ ప్రయాణికులకు తాజాగా వండిన శాకాహారం మాత్రమే అందించనున్నారు. ప్రయాణికుల భద్రత కోసం రైలులో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. భద్రతాసిబ్బంది కూడా కాపలాకాయనున్నారు. భారత్‌ గౌరవ్‌ రైలులో ప్రయాణించాలంటే కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని