IndiGO: పాక్‌ గగనతలంలోకి దూసుకెళ్లిన ఇండిగో విమానం!

ప్రతికూల వాతావరణం కారణంగా అమృత్‌సర్‌ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం పాక్‌ గగనతలంలోకి ప్రవేశించింది.

Updated : 11 Jun 2023 21:49 IST

దిల్లీ: ప్రయాణికులతో అమృత్‌సర్‌ (Amritsar) నుంచి అహ్మదాబాద్‌కు (Ahmedabad) వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight) ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌ గగనతలంలోకి దూసుకెళ్లింది. దాదాపు 30 నిమిషాలపాటు పాక్‌ ఎయిర్‌స్పేస్‌లోనే ప్రయాణించి లాహోర్‌కు సమీపంలో ఉన్న గుర్జన్‌వాలా వరకు వెళ్లిపోయింది. ఈ ఘటన శనివారం రాత్రి 7.30 సమయంలో చోటు చేసుకోగా.. చివరికి రాత్రి 8.01 గంటలకు విమానం తిరిగి భారత్‌కు చేరినట్లు ఇండిగో సంస్థ తాజాగా వెల్లడించింది.

6E-645 విమానం ప్రతికూల వాతావరణం కారణంగా అటారీ మీదుగా పాకిస్థాన్‌ గగనతలంలోకి వెళ్లినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ పాకిస్థాన్‌ విమానయాన అధికారుల అనుమతితోనే జరిగిందని ప్రకటనలో పేర్కొంది. పాక్‌ గగనతలంలోకి వెళ్లిన విమానం తిరిగి అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ అయ్యేంత వరకు అమృత్‌సర్‌ ఏటీసీ అధికారులు పాకిస్థాన్‌ అధికారులతో ఫోన్లో టచ్‌లోనే ఉన్నారని పేర్కొంది.

అంతకుముందు ఇదే విషయాన్ని పాకిస్థాన్‌ వార్తా పత్రిక డాన్‌ వెల్లడించింది.  శనివారం రాత్రి ఇండిగో విమానం లాహోర్‌కు ఉత్తర దిశ నుంచి 454 నాట్స్‌ వేగంతో పాక్‌ గగనతలంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇలా వెళ్లడం తప్పేంకాదని, అంతర్జాతీయంగా దీనిని అనుమతిస్తారని పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్‌లో వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో లాహోర్‌ వెళ్లాల్సిన కొన్ని విమానాలను ఇస్లామాబాద్‌కు మళ్లిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని