Covid in Sewage: మురుగునీటిలో కొవిడ్‌ ఉనికి.. దేశవ్యాప్తంగా అధ్యయనం!

వైరస్‌ జాడను గుర్తించేందుకుగానూ మురుగు నీటిలో పరిశోధనలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో నమూనాలు సేకరించి పరిశోధన చేస్తున్నట్లు తెలిపింది.

Published : 09 Apr 2022 01:56 IST

పర్యావరణ నిఘా మొదలుపెట్టిన ఇన్సాకాగ్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి అదుపులోనే ఉంది. అయినప్పటికీ కొత్త వేరియంట్లు, వాటి ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ జాడను గుర్తించేందుకుగానూ మురుగు నీటిలో పరిశోధనలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో నమూనాలు సేకరించి పరిశోధన చేస్తున్నట్లు తెలిపింది.

‘దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో మురుగు నీటిపై పర్యవేక్షణ ప్రారంభించాం. పర్యావరణంలో కొవిడ్‌ స్థాయిలను తెలుసుకోవడంతోపాటు వైరస్‌ మ్యుటేషన్‌, కొత్త వేరియంట్ల జాడలను కనుక్కునేందుకు ఈ పరిశోధన సహాయపడుతుంది. భారత్‌లో పోలియో నిర్మూలన సమయంలోనూ ఈ తరహా పర్యవేక్షణ చేశాం’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా పేర్కొన్నారు. సమాజంలో వైరస్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ఈ పరిశోధన దోహదం చేస్తుందన్నారు.

వైరస్‌ బయట పడకముందే సమాజంలో దాని ఉనికిని గుర్తించేందుకు మురుగునీటి నమూనా ఎంతో దోహదం చేస్తుందని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం నోరు, గొంతు నుంచే కాకుండా విసర్జన ప్రక్రియలోనూ కరోనా వైరస్‌ బయటపడుతుందని.. ఈ ప్రయోగాల ద్వారా వైరస్‌ ఉనికిని మరింత అంచనా వేయవచ్చని అన్నారు. ఇటువంటి పద్ధతిని టైఫాయిడ్‌ను గుర్తించేందుకు 1920లో ఐర్లాండ్‌  తొలిసారి ఉపయోగించగా.. అనంతరం పోలియో, మిజిల్స్‌, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల ఆనవాళ్లను తెలుసుకునేందుకు వినియోగించారని చెబుతున్నారు.

ఇదిలాఉంటే, వైరస్‌ సంక్రమణను ముందుగానే అంచనా వేయడంలో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సీసీఎంబీ, ఐఐసీటీ పరిశోధనా సంస్థలు మురుగునీటి విశ్లేషణను తొలి, రెండో వేవ్‌ సమయంలోనే చేపట్టాయి. నగరంలోని పలు చెరువులు, కాలువల్లోనూ నీటి నమూనాలను సేకరించి విశ్లేషించాయి. తద్వారా వైరస్‌ ఆనవాళ్లు, వైరల్‌ లోడ్‌ గురించి పలు నివేదికలు రూపొందించాయి. తాజాగా ఇన్సాకాగ్‌ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఇటువంటి పరిశోధన చేపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని