Kejriwal: లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయం దిల్లీ ప్రజలకు అవమానకరం..!

రైతులకు సంబంధించి దిల్లీ సర్కారు నిర్ణయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తిరస్కరించడం నగర ప్రజలకు అవమానకరం అంటూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

Published : 25 Jul 2021 01:25 IST

దిల్లీ: రైతులకు సంబంధించి దిల్లీ సర్కారు నిర్ణయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తిరస్కరించడం నగర ప్రజలకు అవమానకరమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అసహనం వ్యక్తంచేశారు. కొత్త సాగు చట్టాల రద్దుకు ఉద్యమిస్తోన్న రైతులపై నమోదు చేసిన కేసులపై వాదనలు విన్పించేందుకు పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా దిల్లీ సర్కారు ఎంపికచేసిన న్యాయవాదుల బృందాన్ని తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం నియమించిన బృందాన్ని పక్కనబెట్టి.. పోలీసులు సిఫారసు చేసిన న్యాయవాదులకు ఆమోదం తెలపడమేంటని ప్రశ్నించారు. ‘‘దిల్లీ ప్రజలు ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారు. కేంద్రాన్ని భాజపా, దిల్లీని ఆప్‌ పాలించనివ్వండి. కానీ దిల్లీకి సంబంధించి ప్రతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవడం నగర ప్రజలకు అవమానకరం. ప్రజాస్వామ్యాన్ని భాజపా గౌరవించాలి’’ అని విమర్శిస్తూ కేజ్రీవాల్‌ శనివారం ట్వీట్‌ చేశారు.

జనవరి 26న అనుమతించిన మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లో ర్యాలీలు నిర్వహించి విధ్వంసానికి పాల్పడ్డారంటూ రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులకు సంబంధించి పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా వ్యవహరించేందుకు పలువురు న్యాయవాదులతో కూడిన బృందాన్ని ఎంపిక చేస్తూ కేజ్రీవాల్‌ కేబినెట్‌ గత సోమవారం నిర్ణయం తీసుకుంది. భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు ఆ బృందం నివేదించాల్సి ఉంటుంది. అయితే, దిల్లీ కేబినెట్ నిర్ణయాన్ని అనిల్‌ బైజల్‌ తిరస్కరించారు. పోలీసులు ఎంపిక చేసిన మరో బృందానికి ఆయన ఆమోదం తెలిపారు. తన నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు నివేదించినట్లు దిల్లీ ప్రభుత్వానికి రాసిన లేఖలో అనిల్‌ బైజల్‌ పేర్కొన్నారు. అయితే ఇది అత్యవసర అంశంగా భావించి తనకున్న అధికారాల మేరకు పోలీసులు సిఫారసు చేసిన 11 మంది న్యాయవాదుల బృందానికి తాను ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు. ఈ అంశంపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కూడా ఘాటుగా స్పందించారు. దిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా న్యాయవాదుల ఎంపికలోనూ కేంద్రం జోక్యం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని