Mamata: నేతాజీ అదృశ్యం.. ఆ విషయం తెలియకపోవడం దేశానికే అవమానకరం!

నేతాజీ అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా ఆయనకు ఏమైందనే విషయం దేశ ప్రజలకు ఇప్పటికీ తెలియకపోవడం అవమానకరమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు

Updated : 23 Jan 2024 18:07 IST

కోల్‌కతా: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhas Chandra Bose) అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం కాని, ఆయన మరణించిన తేదీ కాని దేశ ప్రజలకు ఇప్పటికీ తెలియకపోవడం అవమానకరమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చిన భాజపా ప్రభుత్వం.. దాన్ని ఇంతవరకు నిలబెట్టుకోలేదని విమర్శించారు.

‘ఎన్నో ఏళ్లు గడుస్తున్నా.. నేతాజీ చనిపోయిన తేదీ తెలియకపోవడం దేశ దురదృష్టం. ఆయనకు ఏమైందో మనకు తెలియదు. నిజంగా దేశానికి ఇది సిగ్గుచేటు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నేతాజీ 127వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన ఆమె.. భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

నేతాజీ మరణం.. 77 ఏళ్లుగా మిస్టరీగానే..!

‘నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు భాజపా హామీ ఇచ్చింది. 20 ఏళ్లుగా నేతాజీ జన్మదినం నాడు జాతీయ సెలవు ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి విఫలమయ్యాయి. నన్ను క్షమించండి’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన దీదీ.. ఈ రోజుల్లో రాజకీయ ప్రచారానికీ సెలవు ప్రకటిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు.

భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhas Chandra Bose) అదృశ్యమైన ఘటన ఏడు దశాబ్దాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది. 1945, ఆగస్టు 18న తైపిలో విమాన ప్రమాదంలో బోస్‌ మరణించారనే వాదన ఉంది. నేతాజీకి చెందినవిగా చెబుతోన్న చితాభస్మం నింపిన పాత్రను 1945 సెప్టెంబరు నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపర్చారు. నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు దర్యాప్తు కమిషన్లు వేసింది. కాంగ్రెస్‌ హయాంలో రెండు, భాజపా ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన ఓ కమిటీ ఇచ్చిన నివేదికలు భిన్నంగా ఉన్నాయి. దీంతో అస్థికలను భారత్‌కు తెప్పించి, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని బోస్‌ కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు